‘మూడు రాజధానుల ఏర్పాటుకు మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతీ నిమిషం ఆరాటపడుతున్నాం. విశాఖలో కార్యనిర్వాహక, అమరావతిలో శాసన, కర్నూలులో న్యాయ రాజధానుల కోసం అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నాం. అనుక్షణం వాటికోసం ఆలోచిస్తున్నాం, ఆ దిశగానే కార్యక్రమాలు చేస్తున్నాం’ అని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖకు వెళ్లేందుకు కాలపరిమితి నిర్ణయించుకున్నారా అని విలేకరులు అడగ్గా.. మంత్రి పైవిధంగా స్పందించారు. ఉగాదికి వెళతామన్నారు కదా అని ప్రశ్నించగా ‘రాజధాని అంశం న్యాయస్థానంలో ఉంది, అలాంటప్పుడు ఉగాదికి వెళతామని చెప్పడం భావ్యం కాదు’ అని చెప్పారు.
‘అమరావతిలోని 29 గ్రామాలూ ఇంకో దేశంలో లేవు కదా? రాష్ట్రంలో అంతర్భాగం, ఇక్కడ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. శాసన రాజధాని ఇక్కడున్నప్పుడు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా? భూములిచ్చిన రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అదీ చేస్తున్నాం’ అని వెల్లడించారు. అమరావతిలో కరకట్ట రహదారి విస్తరణపై మంత్రి స్పందిస్తూ ‘అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డును చంద్రబాబు అయిదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు ?, మేం కరకట్ట రహదారిని విస్తరించి ఇక్కడి ప్రజలకు ఉపయోగపడేలా చేయబోతున్నాం. సీడ్ యాక్సిస్ రోడ్డును కూడా కాజా వరకు పొడిగించి, జాతీయ రహదారికి అనుసంధానం చేసే కార్యక్రమాన్నీ చేస్తున్నాం’ అని తెలిపారు.
ఇదీ చదవండి:
నిర్ణీత గడువులోగా భూ రీసర్వే పూర్తి చేయాలి: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్