రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎందరో విద్యార్థులకు అందుబాటులో ఉంటూ నామమాత్రపు ఫీజుతో ప్రాథమిక, ఇంటర్, డిగ్రీ విద్యను ఎయిడెడ్ విద్యాసంస్థలు అందిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం సొంతగా విద్యాసంస్థలు నిర్వహించలేకే ఈ సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు.
ఇప్పుడు ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని ఏకపక్షంగా నిలిపివేసి, వాటిని పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించాలని... లేనిపక్షంలో ప్రయివేటుగా నడుపుకోవాలంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఇలా చేయడం వల్ల ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యం తమ స్థలాలను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని, బోధనా, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా కోర్సులను నిర్వహించేందుకు నిర్ణయిస్తున్నాయని వివరించారు.
ముఖ్యంగా.. ఈ నిర్ణయం ఉన్నత విద్యను చదివే పేద విద్యార్థులకు సమస్యగా మారనుందని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే కళాశాలు అతి తక్కువగా ఉండటంతో వీరంతా చదువును కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన చెందారు. అందువల్ల ఈ నిర్ణయంపై పునఃసమీక్షించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:
CM Jagan: ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టండి: సీఎం జగన్