మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకి నివాళులర్పించలేనంత బిజీగా రాహుల్ గాంధీ ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జీవితాంతం కాంగ్రెస్ వాదిగా బతికిన ఆయనను కాంగ్రెస్ విమర్శించిందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. పీవీ జ్ఞానభూమిలో పీవీ విగ్రహానికి భాజపా నేత లక్ష్మణ్‌తో కలిసి కిషన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రాహుల్ గాంధీకి.. పీవీకి నివాళులర్పించే సమయం లేదా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో రాహుల్‌పై విమర్శలు గుప్పించారు.
'శత జయంతి వేళ పీవీని రాహుల్ గాంధీ విస్మరించారు. పీవీకి నివాళులర్పించలేనంత బిజీగా రాహుల్ ఉన్నారు. జీవితాంతం కాంగ్రెస్‌వాదిగా బతికిన ఆయనను కాంగ్రెస్ విస్మరించింది. పీవీ విషయంలో రాజకీయ అంటరానితం దురదృష్టకరం.'
-కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
తెలుగు తేజాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి పీవీ అంటూ కిషన్ రెడ్డి కొనియాడారు. పీవీ పోస్టల్ స్టాంప్‌ను తెలుగు ప్రముఖుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విడుదల చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పీవీని ఆ పార్టీతో పాటు నెహ్రూ కుటుంబం అవమానాలకు గురి చేసిందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు.
'పీవీ అంతిమ సంస్కారాలను కూడా కాంగ్రెస్ సరిగ్గా నిర్వహించలేదు. మోదీ ప్రధాని అయ్యాక పీవీ ఘాట్‌ను నిర్మించి గౌరవించాం. పీవీ పేరుతో ఒక ఎమ్మెల్సీ ఇచ్చామని తెలుపుతున్న సీఎం కేసీఆర్... ప్రతి అంశాన్ని రాజకీయాలతో ముడిపెడుతోంది.'
-లక్ష్మణ్, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
పీవీ శత జయంత్యుత్సవాలకు వెళ్లేందుకు స్థానిక నాయకులైన తమకు కనీసం ఆహ్వానం అందలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ఎమ్ఐఎం ఆదేశాల మేరకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఆరోపించారు.
మాటలకే పరిమితం...
పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం.. మాటలకే పరిమితమైందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు నాయకురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. శత జయంతి ఉత్సవాల తీరు ఘనంగా లేదని ఆరోపించారు. ఉత్సవాలకు రూ. 10కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేవలం.. రూ. కోటి 63 లక్షలు మాత్రమే ఖర్చు చేసిందని వ్యాఖ్యానించారు. పీవీ జ్ఞాన భూమిలో డీకే అరుణతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నివాళులర్పించారు. పీవీ నర్సింహారావు తెరాస పార్టీకి చెందిన వ్యక్తి కాదని...అందరూ గర్వపడే వ్యక్తి అని అరుణ అభిప్రాయపడ్డారు. అలాంటి వ్యక్తిని పార్టీకే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'శత జయంతి ఉత్సవాలను పార్టీలకతీతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మహానీయుల విషయంలో గతంలో ప్రభుత్వాలు ఇలానే చేశాయి. కరోనా ఉన్నప్పటికీ ఎన్నికలు జరిగాయి కానీ ఈ ఉత్సవాలు ఎందుకు నిర్వహించలేద'ని డీకే అరుణ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: MLC ramachandraiah:'ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకునే తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు'