రాజధాని గ్రామాల్లో భాజపా రెండోరోజు పాదయాత్ర కొనసాగుతోంది. మంగళగిరి మండలం ఎర్రబాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో భాజపా నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పాల్గొన్నారు. 2014లో అందరి ఆమోదంతోనే అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు. భాజపా కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి అమరావతికి మద్దతు పలికిందని గుర్తు చేశారు. ఒక్క అవకాశం ఇస్తే ఆకాశాన్ని కిందకు దించుతానని నమ్మబలికిన జగన్.. అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని అని ప్రకటించారన్నారు. విశాఖలో దోపిడీ కోసమే రాజధానిని చేశారని విమర్శించారు.
విశాఖలో ప్రైవేటు ఆస్తులను కూడా బెదిరించి కబ్జా చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని తాను రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తీర్మానం చేశామని.. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని భాజపా బలంగా కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ రాజధాని మార్పు అంత సులభం కాదన్నారు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. మళ్లీ మూడు రాజధానులని చెప్పటం కోర్టు తీర్పును ఉల్లంఘించటమేనని వ్యాఖ్యానించారు. అమరావతికి మోదీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని... ఇక్కడి నుంచి రాజధాని కదిలించలేరని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: