భాజపా నేతలపై తెరాస ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను దీటుగా ఎదుర్కొంటామని.. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పరిణామాలపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు తరుణ్ చుగ్.. బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. భాజపా నేతలపై వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. తెరాస కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని బండి వివరించినట్లు చెప్పారు. ఈ మేరకు నివేదికను జాతీయ నాయకత్వానికి పంపారు. ఈ నేపథ్యంలో డీకే అరుణ, జితేందర్ రెడ్డితో విడివిడిగా బండి సంజయ్ భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
"భాజపా హత్య రాజకీయాలు సమర్థించదు. రిమాండ్ రిపోర్ట్‌లో భాజపాకి సంబంధం లేదని బయటపడింది. ఎఫ్ఐఆర్లో కానీ, పోలీసుల దర్యాప్తులోగానీ... ఎక్కడా భాజపా నేతల పేర్లు రాకపోయినా వారిపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. దిల్లీ వెళ్లి వారెంటు లేకుండానే జితేందర్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. జితేందర్‌రెడ్డి డ్రైవర్‌పై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఏం చేసినా నడుస్తుందని తెలంగాణ పోలీసులు అనుకుంటున్నారు. ఎవరి అనుమతితో వెళ్లి జితేందర్‌రెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేశారు..? ఇది పక్కా కిడ్నాప్ వ్యవహారమే. చట్టాలను చదువుకున్న అధికారులే వాటిని కాలరాసేలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ పోలీసులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది భాజపానేనని సర్వేలన్ని అంటున్నాయి. దాంతో ముఖ్యమంత్రి డిఫ్రెషన్లో పడ్డారు. సలహాలు, సూచనల పేరుతో హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని అడ్డుకుంటాం." - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
సీబీఐ విచారణ జరిపించాలి..
మంత్రి హత్యకు కుట్ర కేసులో భాజపా నేతలపై ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సీబీఐపై నమ్మకం లేకపోతే న్యాయవిచారణ జరిపించాలన్నారు. ఎలాంటి మచ్చ లేని తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు విచారణకు పిలిస్తే తప్పకుండా సహకరిస్తానన్న జితేందర్‌రెడ్డి.. దుబ్బాక, హుజూరాబాద్‌లో భాజపా గెలుపు ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
'తెలంగాణ ఉద్యమ కారులతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ నుంచి కార్యకర్తలు దిల్లీకి వస్తే నా ఇంటికి వచ్చేవారు. ఉద్యమ కారులకు వసతి కల్పించడం నా బాధ్యత. మంత్రి హత్యకు కుట్ర కేసులో భాజపా నేతలపై ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలి.'
- జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ
'తెరాస నాటకాలు ఆడుతోంది'
మంత్రి హత్యకు కుట్ర జరిగిందని తెరాస నాటకాలు ఆడుతోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. గత నెల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై రాఘవేందర్‌రావు పిటిషన్ వేశారని వెల్లడించారు.
'గత నెల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై రాఘవేందర్‌రావు పిటిషన్ వేశారు. ఎన్నికల వేళ తన అఫిడవిట్‌ను ట్యాంపర్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. గత నెల 23న రాఘవేందర్‌రావు తమ్ముడు నాగరాజును కిడ్నాప్ చేశారు. మంత్రికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని యాదయ్యపై కక్ష పెంచుకున్నారు. గత నెల 24న యాదయ్యనూ కిడ్నాప్ చేశారు.' - డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు
ఇంటిపై రాళ్ల దాడి..
మరోపక్క.. మహబూబ్‌నగర్‌లోని భాజపా నాయకుడు జితేందర్‌రెడ్డి ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. దుండగుల దాడిలో కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. నిన్న రాత్రి కూడా జితేందర్‌రెడ్డి ఇంటిపై దుండగుల దాడి చేయగా... కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు.. మహబూబ్‌నగర్‌లో మోహరించారు.
ఇవీచూడండి: