రాజధానిపై ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా తుళ్లూరులో మహాధర్నా చేపట్టిన రైతులకు.. భాజపా నేతలు సంఘీభావం తెలిపారు. ఎంపీ సుజనా చౌదరి, రావెల కిశోర్ బాబు సహా... ఇతర భాజపా నేతలు నిరసనకారులతో మాట్లాడారు. ఉదయం అమరావతి అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తయిన తర్వాత... సుజనా చౌదరికి రాజధాని రైతులు వినతిపత్రం ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా తుళ్లూరు చేరుకొని రైతులకు సంఘీభావం తెలిపారు.
మందడం, వెలగపూడి వెళ్లి రైతులతో మాట్లాడారు. రాజధానిని అమరావతి నుంచి తరలించాలని చూస్తే కేంద్రం చూస్తూ ఊరుకోబోదని సుజనా హెచ్చరించారు. సీఆర్డీఏ, ఆర్అండ్ఆర్ చట్టాల ప్రకారం రాజధాని మార్పు అసాధ్యమని వివరించారు. అమరావతి ప్రాంత ప్రజలు అధైర్యపడొద్దని... భాజపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సీఆర్డీఏలో సంతకాలు పెట్టిన అమరావతి ప్రజలకు పరిహారం కోరే హక్కు ఉందని.. భాజపా ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. తుళ్లూరులో నిరసనలో ఉన్న రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన... ప్రజాస్వామ్యంలో పొరపాట్ల వల్లే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగి ఉంటే విచారణ జరపాలి తప్ప... రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
ఇవీ చదవండి..