వైకాపా నేతలపై భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దిల్లీలో మాట్లాడిన ఆయన.. తమ పార్టీకి చెందిన నేతలతో పాటు నిలువు నామాలపై వైకాపా నేతలు చేస్తున్న విమర్శలు హిందూ మతాన్ని కించపరిచేలా ఉన్నాయని అన్నారు. తిరుపతి వైకాపా అభ్యర్థికి హిందువుల మనోభావాలపై ఏమాత్రం గౌరవం లేదని దుయ్యబట్టారు. వైకాపా అభ్యర్థి గురుమూర్తి హిందువా..? కాదా..? అనే విషయం ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఎస్సీ సర్టిఫికెట్ తో పోటీ చేస్తున్నారంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
'గురుమూర్తి ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అనర్హుడు. ఆయన రిజర్వ్ కాని నియోజకవర్గం నుంచి పోటీ చేసుకోవచ్చు. భాజపా ఈ విషయాన్ని అన్ని రాజ్యాంగ సంస్థల దృష్టికి తీసుకెళ్లి న్యాయ పోరాటం చేస్తుంది. రాష్ట్రంలో మత మార్పిడులను ప్రోత్సహించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా చేసే ఈ ప్రయత్నాలను భాజపా పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని ఈసీని కోరుతాం. నకిలీ ఓటర్ ఐడీ కార్డుల వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తాం'- జీవీఎల్, భాజపా ఎంపీ
వాలంటీర్ల వ్యవస్థను వైకాపా ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటోందని జీవీఎల్ ఆరోపించారు. డబ్బులు పంచి ఓట్లు అడగడానికి సైతం వాలంటీర్ల వ్యవస్థను సమాంతరంగా నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఆధ్యాత్మికతను దృష్టిలో పెట్టుకుని ఆ క్షేత్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తామన్నదీ తమ మేనిఫెస్టోలో పొందుపరిచామని చెప్పారు. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి:
నీటి కుంటలో శవంగా తేలిన భర్త.. ఇంట్లో ఉరేసుకుని భార్య ఆత్మహత్య.. అసలేం జరిగింది?