ఏపీలో ప్రత్యామ్నాయం భాజపాతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. భాజపా గెలుపునకు పేజ్ ప్రముఖ్ వ్యవస్థ కీలకమైందని తెలిపారు. కోడికత్తి పీకే తమ పేజ్ ప్రముఖ్ వ్యవస్థను కాపీ కొట్టారన్నారు. మరోవైపు జగన్ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాకే దశదిశా ఉన్న ప్రభుత్వం వస్తుందన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో వైకాపా ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులపై త్వరలో పోరాటం చేస్తామన్నారు. సాగునీటి సమస్యల పరిష్కారానికి ఈనెల 19న 'చలో కడప' కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. నిరుద్యోగులకు నిరీక్షణ తప్ప ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు.
పేజ్ ప్రముఖ్ అంటే..
క్షేత్రస్థాయి నుంచి.. సాధారణంగా లోక్‌సభ ఎన్నికను.. నియోజకవర్గం, వార్డులు లేదా డివిజన్లు, పోలింగ్ బూత్‌లు ఇలా విభజించుకుని పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతాయి. కానీ పేజ్ ప్రముఖ్ వ్యవస్థ.. మరింత క్షేత్రస్థాయి నుంచి పని చేస్తుంది. ప్రచారంలో అన్ని ప్రాంతాలను కవర్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు క్షేత్రస్థాయి సమన్వయం కోసం.. పేజ్ ప్రముఖ్ వ్యవస్థను భాజపా రూపొందించింది. పోలింగ్‌బూత్‌లో ప్రతీ పేజ్‌కు పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తిని గుర్తిస్తారు. ఇతడే పేజ్ ప్రముఖ్. వారికి పార్టీ విధివిధానాలు, మ్యానిఫెస్టో, చేసిన అభివృద్ధి, చేస్తామని చెబుతున్న హామీలు ఇలా ప్రతీ అంశంలోనూ.. ఆ పేజ్ ప్రముఖ్‌కు శిక్షణ ఇస్తారు. వారికి ఆ పేజ్‌లోని మిగిలిన ఓటర్లను పార్టీకి అనుకూలంగా మార్చి ఓటు వేయించేలా బాధ్యత అప్పగిస్తారు. అలా ఒక్క పోలింగ్ బూత్ కే సుమారు 10-15మంది పేజ్ ప్రముఖ్ లను ఏర్పాటు చేసుకుని వ్యూహాన్ని అమలు చేస్తారు. ఈ వ్యూహం ద్వారానే ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతమైన కమళదళం..ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఇదీ చదవండి: Tulasi Reddy on Pawan: భాజపా చేతిలో పవన్ 'కీలుబొమ్మ': తులసిరెడ్డి