ఎన్నికల జిమ్మిక్కులతో తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో.. దిగజారుడు రాజకీయలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దిల్లీలో సమావేశమైన భాజపా ముఖ్యనేతలు.. రేపు రాష్ట్రంలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై హైదరాబాద్లో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రేపు నిర్వహించనున్న కార్యక్రమానికి 48 గంటల ముందు నుంచే.. భాజపా నాయకులను అరెస్ట్ చేయటం అన్యాయమని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని ముఖ్యమంత్రి... ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారని ఎద్దేవా చేశారు. అన్ని సర్వేలు భాజపాకే మొగ్గు చూపాయని తెలిసి.. ఈటల రాజేందర్ కుటుంబసభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తూ... నీచమైన రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. ఎన్ని అరెస్టులు చేసినా.. రేపు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరతామని భాజపా నేతలు స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం..
జీహెచ్ఎంసీ మేయర్, అధికారులపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాలు కూల్చివేయాలని నిర్ణయించిన అధికారులు... కేవలం హిందువుల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేయటాన్ని సంజయ్ ఖండించారు. ఎంఐఎం శాసనసభ్యుల ప్రాంతాలైన చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్లకు మినహాయింపు ఇవ్వడం అన్యాయమని మండిపడ్డారు.
ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎంఐఎం శాసన సభ్యుల నియోజకవర్గాలకు మినహాయింపు ఇచ్చి అక్రమ నిర్మాణాల పేరిట హిందువుల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తున్నారని ఆరోపించారు. ఇది ఒక రకంగా మెజారిటీలపై ప్రభుత్వం చేస్తున్న దాడిగా బండి ఆక్షేపించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూల్చివేతలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ జోన్, చార్మినార్ జోన్లో వేలాది అక్రమ నిర్మాణాలు కూల్చి వేసిన తర్వాతనే మిగతా జోన్లలో చేపట్టాలన్నారు.
జోగులాంబకు మెడికల్ కాలేజీపై కేంద్రమంత్రికి లేఖ...
జోగులాంబ గద్వాల్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా జోగులాంబ గద్వాల్ అని, ఈ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని కోరుతూ పలువురు ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు.
కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సైతం తెలంగాణలో 7 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ సైతం మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం 150 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ జిల్లాకు మినహా ఇతర జిల్లాల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జోగులాంబ గద్వాల్ జిల్లాలో 300 పడకలతో కూడిన మెడికల్ కాలేజీని మంజూరు చేయాలని లేఖలో కోరారు.
ఇవీ చూడండి:
Jagananna vidya deevena: 'ప్రభుత్వం తరఫున.. విద్యార్థులకు ఇవ్వగలిగిన ఆస్తి చదువే..'