కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించడం దేశ వైజ్ఞానిక పరిజ్ఞానానికి నిదర్శనమని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. ఇందుకు సహకరించిన ఐసీఎంఆర్, ఎన్‌ఐవీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రక్రియలో అండగా ఉన్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. కొవాగ్జిన్ తీసుకున్న ప్రజలందరికీ భారత్ బయోటెక్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు కొవాగ్జిన్‌ను దిగుమతి చేసుకునే ప్రక్రియ వేగవంతం చేసుకోవచ్చన్నారు.
మూడో దశ క్లీనికల్ ట్రయల్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థకు జులైలో అందించామని.. అనంతరం ఈయూఎల్ (Emergency Use Listing) ప్రక్రియ ప్రారంభించిందని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల తెలిపారు. అక్టోబర్‌లో క్లీనికల్ ట్రయల్స్ డేటాను సమీక్షించారని పేర్కొన్నారు. ప్రభావవంతమైన పనితీరు చూపేందుకు ఇదో సదావకాశమని.. ప్రపంచవ్యాప్తంగా టీకా అందించేందుకు ఈ అనుమతి కీలకమన్నారు. నాణ్యతా, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించామని, ఫలితంగానే ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందని కృష్ణ ఎల్ల అన్నారు. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన చాలా టీకాలకు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఉందన్నారు.
కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు చేస్తున్న కృషిలో కీలకపాత్ర పోషించేందుకు భారత్ బయోటెక్ మరింత ముందుకు వెళ్తోందని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీచూడండి: