తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారాముల ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున భద్రాద్రి రామయ్య మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అవతారంలో ఉన్న స్వామివారిని ఆలయ అర్చకులు బేడా మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహా నివేదన అనంతరం మత్స్య అవతారంలో ఉన్న స్వామి వారిని ఆలయం కింద ఉన్న చిత్రకూట మండపం వద్దకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో తీసుకువస్తారు. అనంతరం భక్తులకు మండపంలో దర్శనమిస్తారు. 'పూర్వకాలంలో సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను సముద్రంలో పారేయడంతో విష్ణుమూర్తి మత్స్య అవతారం ఎత్తాడు. సముద్రంలో ఉన్న సోమకాసురుడుని హరించాడు. వేదాలను బయటకు తీసుకు వచ్చారని' పురాణాలు చెబుతున్నాయి. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల కేతు గ్రహ బాధలు తొలగిపోతాయని వేదపండితులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: రాజధాని గురించి భాజపా సూచనలపై ఆలోచిస్తాం: ధర్మాన