Letter to ap Energy Secretary: రాష్ట్రంలో 2030 నాటికి 6.68 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ (ఎంటీవోఈ) ఇంధన సామర్థ్య లక్ష్యాన్ని సాధించేలా తగిన కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) సూచించింది. కీలక రంగాల్లో ఇంధన సామర్థ్యం, ఇంధన పరిరక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్‌బాక్రే రాష్ట్ర ఇంధన కార్యదర్శి బి.శ్రీధర్‌కు లేఖ రాశారు.
అందులో "కేంద్ర ప్రభుత్వం కార్బన్ మార్కెట్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. నేషనల్ కార్బన్ మార్కెట్‌పై బీఈఈ ఒక నమూనా మార్గదర్శిని రూపొందించింది. దీనివల్ల ఇంధన సామర్థ్య రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి. దేశంలో 2031 నాటికి రూ.10.02 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముంది. పరిశ్రమల రంగంలో రూ.5.15 లక్షల కోట్లు, రవాణా రంగంలో రూ.2.26 లక్షల కోట్లు, గృహ నిర్మాణ రంగంలో రూ.1.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉంది" అని పేర్కొన్నారు.
తిరుమల, తిరుపతి దేవస్థానంలో ఇంధన సామర్థ్య, ఇంధన పరిరక్షణ, నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా కార్బన్ ఉద్గారాల తగ్గింపులో తీసుకున్న చర్యలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ కుకింగ్, తితిదే ఆసుపత్రులు, భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యలు అవకాశాలను పరిశీలించాలని లేఖలో బాక్రే కోరారని రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి: మూడేళ్లలో ముందుకు సాగని సాగునీటి ప్రాజెక్టులు... ఎప్పటికప్పుడు గడువు పెంపు!