కరోనా మహమ్మారితో అస్తవ్యస్తంగా మారిన ప్రజాజీవనాన్ని గాడిన పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1,75,000 కోట్ల ప్యాకేజీని స్వాగతిస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి బాధిత కుటుంబాలకు భరోసానివ్వాలని డిమాండ్ చేశారు. తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కారణంగా నష్టపోయిన తమను ఆదుకునేందుకు సీఎం చర్యలు తీసుకుంటారని ఆశించిన రైతులకు నిరాశే మిగిలిందన్నారు. సీఎం జగన్ ప్రసంగం రాష్ట్ర ప్రజల్లో భరోసా నింపలేకపోయిందని అన్నారు.
ఉద్యాన పంటలు కొనుగోలు చేయాలి
లాక్డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యాలు లేక అరటి, బత్తాయి, కర్బూజ, మామిడి, తదితర ఉద్యాన పంటల ఉత్పత్తులు పొలాల్లోనే కుళ్లిపోయే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాటిని కొనుగోలు చేసి రైతుబజార్లలో చౌకధరలకు విక్రయించాలన్నారు. ఆక్వా రైతలకు ఫీడ్ పంపిణీ, నిల్వ సదుపాయాల కల్పన, ఉత్పత్తులకు సరైన ధర లభించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంఖ్యపై స్పష్టత లేదు
విదేశాల నుంచి రాష్ట్రానికి ఎంత మంది వచ్చారనే దానిపై ప్రభుత్వ పెద్దలు రోజుకో రకంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. బుధవారం వరకు 12 వేల మంది అని చెప్పి... గురువారం 27,819 మంది వచ్చారని చెప్పడం ప్రభుత్వ డొల్లతనమేనని విమర్శించారు. క్వారంటైన్ చేయకుండా వదిలిపెట్టి ఇప్పుడు వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేస్తున్నామనడం నిర్లక్ష్యమేనని అన్నారు. సరిహద్దుల వద్ద విద్యార్థుల అవస్థలకు ప్రభుత్వం, అధికారుల సమన్వయ లోపమే కారణమని మండిపడ్డారు. కూరగాయలు, నిత్యావసరాల కోసం జనం మార్కెట్లలో గుంపులుగా రాకుండా... బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసరాలను ప్యాక్ చేసి వినియోగదారుల ఇంటి ముంగిటకే చేర్చాలన్నారు.
మొక్కుబడి చర్యలే
'కరోనా నియంత్రణకు ఒడిశాలో 1000 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నారు. కేరళలో రూ.20 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. తెలంగాణ, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాలన్నీ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తుంటే... మన ప్రభుత్వం మొక్కుబడిగా 29న రేషన్, ఏప్రిల్ 4న రూ.1000 అందిస్తామని ప్రకటించడం' దారుణం అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతాంగాన్ని ఆదుకోవాలని సీఎస్‌కు లేఖ
లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకోలేక భారీగా నష్టపోయారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు మద్దతు ధర లభించేలా చూడాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఆయన లేఖ రాశారు. ఉద్యాన, మత్స్య, కోళ్ల పరిశ్రమలపై ఆధారపడ్డవారు, రబీలో సాగు చేసిన రైతాంగాన్ని , కౌలు రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: