రాష్ట్రంలో దాదాపు 7లక్షల మంది ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. వీరిలో సగం మంది వరకూ అద్దెకు ఆటోలు తీసుకుని నడిపేవారే ఉన్నారు. మిగతావారు అప్పు చేసి ఆటో కొని తిప్పుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. ఇలా ఫైనాన్స్ కింద తీసుకుని నడిపేవారు 4లక్షల వరకూ ఉండొచ్చని అంచనా. మార్చి 22 నుంచి కరోనా లాక్ డౌన్ కారణంగా ఆటోలు రోడ్డెక్కని పరిస్థితి. అన్ లాక్ మొదలయ్యాక ఆటోలకు కొన్ని నిబంధనలు, జాగ్రత్తలతో రోడ్లపైకి అనుమతించారు. ప్రస్తుతం రోజువారి ఆదాయం 300 నుంచి 400 మించటం లేదు. అందులో ఇంధనం ఖర్చులు తీసేస్తే మిగిలేది అరకొరా మాత్రమే. దీనికి తోడు పెరుగుతున్న డీజిల్ ధరలు అదనపు భారంగా మారాయి.
అదనంగా ఖర్చులు...
కరోనా నివారణ చర్యల్లో భాగంగా పారిశుధ్యం చేపట్టాల్సి రావటంతో ఆటోవాలాలకు అదనంగా ఖర్చవుతోంది. ప్రయాణికులకు, డ్రైవర్‌కు మధ్య తెర తప్పనిసరి కావటం... ఆటోని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాల్సి రావటం ఇవన్నీ ఖర్చులే. వీటిని దాటుకుని ఆటో డ్రైవర్ ఆదాయం పొందటం గగనమైంది. ఎందుకంటే ప్రతినెలా ఆటో ఫైనాన్సియర్స్ కు వాయిదా సొమ్ము చెల్లించాలి. తీసుకున్న అప్పు... తీర్చే గడువుని బట్టి ఇది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఎంత లేదన్నా నెలకు 4వేల రూపాయల నుంచి 8వేల రూపాయల వరకూ వాయిదా చెల్లించాలి. గత ఆరు నెలలుగా చాలా మంది ఆటోవాలాలు ఈ సొమ్ము చెల్లించలేకపోతున్నారు.
కరోనా భయం....
ప్రస్తుతం అన్ లాక్ మొదలైనా జనం గతంలో మాదిరిగా ఎక్కువగా బయటకు రావటం లేదు. అలా వెళ్లేవారు కూడా వ్యక్తిగత వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో ఆటోల్లో వెళ్తే వైరస్ బారిన పడతామోననే ఆందోళన ఉంది. దీంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ లేదు. దీనికి తోడు ప్రయాణికుల రైళ్లు ఒకటి ఆరా మాత్రమే తిరుగుతున్నాయి. అలాగే సినిమా హాళ్లు, వినోద కేంద్రాలు తెరచుకోలేదు.
దీంతో రైల్వే స్టేషన్లు, పర్యాటక ప్రాంతాలు, థియేటర్లకు వెళ్లేవారు లేక ఆటోలకు డిమాండ్ పడిపోయింది. ఎక్కువగా ఖాళీగా వెళ్తున్న ఆటోలే కనిపిస్తున్నాయి. ఫైనాన్స్‌లో ఆటోలు తీసుకుని నెలసరి వాయిదా చెల్లించలేకపోతే వాహనం తీసుకెళ్లిపోతారు. మరికొందరు ఎంతో కొంత చెల్లించి ఆటోను కాపాడుకుంటున్నారు. అయితే వాయిదా చెల్లించకపోతే దానిపై అదనపు వడ్డీ వేసి మరుసటి నెల చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. వస్తున్న అరకొరా ఆదాయంతో ఇలా వాయిదాలు, వాటిపై వడ్డీలు చెల్లించలేక ఆటోవాలాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద లబ్ధి పొందిన వారు 2.36 లక్షలు మాత్రమే. సొంత ఆటో ఉన్నవారు సైతం వివిధ కారణాలతో ఆ ప్రయోజనం పొందలేకపోయారు. అద్దెకు ఆటోలు తీసుకుని నడిపేవారైతే ఎటూ ఈ పథకానికి అనర్హులు. వారు కూడా ఇపుడు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి
'మా పార్టీకి సిద్ధాంతాలున్నాయి.. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాల్సిందే'