Attack on car driver: తెలంగాణ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లికి చెందిన వివేక్‌రెడ్డి.. గత నెల 31 రాత్రి 11.30 గంటలకు బీఎన్‌రెడ్డినగర్ నుంచి ఉప్పర్‌పల్లికి కారు బుక్ చేసుకున్నాడు. నారాయణ్‌ఖేడ్‌కు చెందిన వెంకటేశ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు కారుతో వివేక్ ఉన్న చోటుకు చేరుకున్నాడు. మార్గమధ్యలో వెంకటేశ్.. కారు యజమాని పర్వతాలును వాహనంలో ఎక్కించుకున్నాడు. ఉప్పర్‌పల్లి చేరాక.. మద్యం మత్తులో ఉన్న వివేక్‌రెడ్డి రూ.600 కిరాయి ఇవ్వకుండా కారు దిగి వెళ్లబోయాడు. డబ్బులు గురించి డ్రైవర్ అడిగినా.. సమాధానం చెప్పకుండా గొడవకు దిగాడు. అడ్డుకోబోయిన యజమాని పర్వతాలుపై చేయి చేసుకున్నాడు.
attack on car driver in Hyderabad : అనంతరం ఈ విషయాన్ని వివేక్.. ఫోన్ ద్వారా తన స్నేహితులకు చేరవేశాడు. కొద్ది సమయంలోనే కొంతమంది యువకులు అక్కడకు చేరుకొని డ్రైవర్, యజమానిని చితకబాదారు. డబ్బులు ఇవ్వకున్నా పర్వాలేదంటూ కాళ్లమీద పడినా.. కనికరం చూపలేదు. క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా కొట్టారు. రెండు గంటల పాటు పరుగెత్తించి దాడి చేశారు. పెట్రోలింగ్ వాహనంలో వచ్చిన పోలీసులు బాధితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినా.. నిందితులు వారి ముందే దాడి చేసినట్లు బాధిత కుటుంబసభ్యులు వాపోయారు.
కోమాలోకి వెంకటేశ్.. దాడి అనంతరం నిందితులు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో వెంకటేశ్, పర్వతాలు తమపై దాడి చేశారని, బంగారు గొలుసు చోరీ చేశారని ఫిర్యాదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆసుపత్రికి తరలించకుండా మరుసటి రోజు ఉదయం వరకూ స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. ఆగస్టు 1న ఉదయం వెంకటేశ్ వాంతులు చేసుకొని కుప్పకూలాడు. బంధువులకు సమాచారం ఇచ్చిన పోలీసులు.. ఆ ఇద్దరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఏడు రోజులుగా వెంకటేశ్ కోమాలో ఉన్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పర్వతాలు కోలుకుంటున్నట్లు సమాచారం.
నిందితులకు కానిస్టేబుల్ సహకారం.. ఆసుపత్రిలోకి చేర్చాక పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొని వివేక్‌రెడ్డిని.. అతని స్నేహితులపై మొదట సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారు. రెండు రోజుల తరువాత సెక్షన్ 307 కేసు నమోదు చేశారు. ఇదంతా జరుగుతుండగానే వివేక్‌రెడ్డి పోలీసులకు దొరకకుండా.. నేరుగా న్యాయస్థానంలో లొంగిపోయాడు. రిమాండ్‌లో ఉన్న నిందితుడిని పోలీసులు కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గాయపడిన ఇద్దరినీ సకాలంలో ఆసుపత్రికి చేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రాణాల మీదకు వచ్చిందని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. దాడి చేసిన యువకులకు తప్పించేందుకు ఓ కానిస్టేబుల్ సహకరించారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.