రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే స్థానిక ఎన్నికలను అడ్డుకుంటోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీనియర్ ప్రభుత్వ అధికారిణి నీలం సాహ్నీ.. అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకోవడం బాధాకరమంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
స్థానిక ఎన్నికలు నిర్వహించలేమంటూ ఎస్ఈసీకి సీఎస్ రాసిన లేఖ షాక్‌కు గురిచేసిందని అందులో పేర్కొన్నారు. పాఠశాలల పునఃప్రారంభానికి తల్లిదండ్రులు, మేధావుల సూచనలు ఖాతరు చేయని ప్రభుత్వం.. ఎన్నికల నిర్వహణకు ఎందుకు భయపడుతోందని నిలదీశారు.
ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా సింగపూర్, అమెరికాలో దేశాల్లో ఎన్నికలతోపాటు మన దేశంలోనూ బిహార్ ఎన్నికలు జరిగాయని అచ్చెన్న గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమైన విషయాన్ని ప్రస్తావించారు. రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తికి విరుద్ధంగా ఎస్ఈసీకి సీఎస్ రాసిన లేఖ ఉందని విమర్శించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎస్ఈసీకి రాసిన లేఖలో అంశాలను పునఃపరిశీలించి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి:
ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ.. ఎన్నికల కమిషనర్‌కు.. సీఎస్ లేఖ