రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16న కొవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ.. టీకా వేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. వ్యాక్సిన్ నిల్వ, రవాణా, పంపిణీకి అవసరమైన కూలర్లు, ఐస్ రిఫ్రిజిరేటర్లు ఇప్పటికే సమకూర్చుకున్నారు. ఉన్నతాధికారుల సూచనలు మేరకు స్థానిక సిబ్బంది చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
కడప జిల్లాలో...
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం కడప జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కడపతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకూ ప్రాంతీయ టీకా నిల్వ కేంద్రాన్ని స్థానికంగా ఏర్పాటు చేయడంతో.. వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈనెల 16న 20 స్థానిక కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉండగా.. డీహెచ్ఎంవో కార్యాలయంలో ఇప్పటికే కూలర్‌ను సిద్ధం చేశారు, మరొకటి త్వరలోనే రానుంది. 10 లక్షల టీకాలు నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేయగా.. 30 వేల సామర్థ్యానికి అవసరమైన ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్లనూ అందుబాటులో ఉంచారు. మూడుజిల్లాలకు అవసరమైన వ్యాక్సిన్లు.. జిల్లాకు రేపు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జేసీ సాయికాంత్ వర్మ, డీఎంహెచ్‌వో అనిల్ కుమార్, పోలీస్ కమిషనర్ లవన్న, అదనపు ఎస్పీ ఖాసీంసాహెబ్ ఏర్పాట్లను పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
దేశ వ్యాప్తంగా జనవరి 16న నిర్వహించనున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు.. తూర్పుగోదావరిలోని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన ఏర్పాట్లు చేశారు. పది నెలలుగా కరోనా కట్టడికి పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో.. ఇప్పటికే వారితో డ్రై రన్ నిర్వహించారు. ముమ్మడివరంలో వంద మందికి టీకా వేసేందుకు అర్హులను గుర్తించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు వైద్య సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదీ చదవండి: 'కోళ్లు పెంచుకోవటం నేరమని ఏ చట్టంలో ఉంది'