IAF Chopper Crash: తమిళనాడులోని కూనురులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఏపీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం ఎగువరేగడ గ్రామవాసి సాయితేజ్ ఈ ప్రమాదంలో మృతి చెందాడు. లాన్స్ నాయక్‌గా ఉన్న సాయితేజ్.. సిడిఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
ఆర్మీ సిఫాయిగా చేరి..
సాయితేజ్.. 2013లో ఆర్మీ సిఫాయిగా చేరాడు. సిఫాయిగా పని చేస్తూ ఏడాది తర్వాత పరీక్షలో ఉత్తీర్ణుడై పారా కమెండోగా ఎంపికయ్యాడు. లెవెన్త్ పారాలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. బెంగళూరులో సిఫాయిలకు శిక్షకుడుగా పని చేసిన సాయితేజ్.. ప్రస్తుతం బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సాయితేజ్‌కు భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ, కూతురు దర్శిని ఉన్నారు. వీరి కుటుంబం గత ఏడాదిగా మదనపల్లె ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటుంది. ఇవాళ ఉదయం 8:15కు సాయితేజ్ ఓ సారి ఫోన్ చేశారని.. 8:45 వీడియో కాల్ చేసి పిల్లలతో మాట్లాడారని కుటుంబసభ్యులు తెలిపారు. సాయితేజ్ మరణంతో.. గ్రామంలో విషాదం నెలకొంది.
హెలికాప్టర్ ఘటనలో.. ఏం జరిగిందంటే
Bipin Rawat passed away: హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న Mi-17V5 చాపర్ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.
లెక్చర్ ఇచ్చేందుకు వెళ్లి..
కోయంబత్తూర్ సమీపంలోని సూలూర్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన Mi-17V5 చాపర్.. కూనూర్ సమీపంలోని కట్టేరి- నాంచప్పనంచథ్రం వద్ద మధ్యాహ్నం 12.20-12.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది. జనరల్ రావత్.. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ స్టాఫ్ కాలేజ్‌లో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పొగమంచుతో వెలుతురు సరిగా లేకపోవడమే.. ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. చాపర్.. నివాస ప్రాంతాలకు కాస్త దూరంగా కూలిపోవడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది. ఘటన సంబంధిత దృశ్యాలు.. భయానకంగా ఉన్నాయి. హెలికాప్టర్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది.బిపిన్ రావత్ మృతిపట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. రావత్ సేవలను గుర్తు చేసుకున్నారు.
దేశం ఓ వీర సైనికుడిని కోల్పోయింది: రాష్ట్రపతి
సైనిక హెలికాప్టర్ ఘటన తనను తీవ్రంగా బాధించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన సతీమణి మధులిక మరణం తనను షాక్‌కి గురిచేసిందన్నారు. ఓ ధైర్యవంతుడైన సైనికుడ్ని దేశం కోల్పోయిందని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల పాటు మాతృభూమికి నిస్వార్థంగా సేవలందించిన బిపిన్ రావత్ తన శౌర్యంతో, వీరత్వంతో గుర్తింపు పొందారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
బిపిన్ రావత్ అద్భుత సైనికుడు - ప్రధాని మోదీ
''జనరల్ బిపిన్ రావత్ అద్భుత సైనికుడు. నిజమైన దేశభక్తుడు. ఆయన మన సాయుధ బలగాలను, భద్రతా యంత్రాంగ ఆధునీకీకరణలో దోహదపడ్డారు. వ్యూహాత్మక విషయాలపై ఆయన ఆలోచనలు అసాధారణం. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఓం శాంతి.''- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.
ఆయన నిబద్ధతను మాటల్లో చెప్పలేం- అమిత్ షా
ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ మృతిచెందడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మన సీడీఎస్‌ని ఘోర ప్రమాదంలో కోల్పోవడం బాధాకరమన్నారు. ధైర్య సాహసాలతో కూడిన గొప్ప సైనికుల్లో ఆయన ఒకరని, మాతృభూమికి నిస్వార్థంగా సేవ చేశారని కొనియాడారు. బిపిన్‌రావత్ చేసిన సేవల్ని, ఆయన నిబద్ధతను మాటల్లో చెప్పలేమన్నారు. ఆయన మరణం బాధించిదన్నారు. అలాగే, బిపిన్ రావత్ సతీమణి మధులికరావత్‌తో పాటు మరో 11 మంది సైనికులు మరణించడం కలిచివేసిందని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. గాయపడిన గ్రూపు కెప్టెన్ వరుణ్‌సింగ్‌త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు.
తీరని లోటు - రక్షణ మంత్రి రాజ్ నాథ్
సీడీసీ బిపిన్ రావత్ మరణం పట్ల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అన్నారు.ఇదీ చదవండి:Army
ఇదీ చదవండి: