పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్షకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడంపై ఉత్పత్తి సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. పీపీఏలను సమీక్షించేందుకు సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయగా....సౌర , పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే . దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జీవో నెంబర్ 68 తో పాటు , ఏపీఎస్పీడీసీఎల్ జులై 12న రాసిన లేఖ అమలును నిలుపదల చేసింది. పీపీఏలను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. సంప్రదింపుల కమిటీని నియమించే అధికారం లేదంటూ విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరపున న్యాయవాదులు వాదించారు. ఒప్పందం ప్రకారం ఒకసారి నిర్థారించిన విద్యుత్ యూనిట్ టారిఫ్ ధరను కుదించడానికి వీల్లేదన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.
విద్యుత్ సరఫరా నిలివేతపై...
ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను తీసుకోకుండా సరఫరా నిలిపివేయడంపై పవన విద్యుత్ సంస్థలు హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశాయి. విద్యుత్ సరఫరా కనెక్షన్లను అధికారులు ఏకపక్షంగా కత్తిరించారని ఉత్పత్తి సంస్థలు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చాయి. ప్రభుత్వం తీరుతో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థల మనుగడ ప్రశ్నార్థకమయ్యేలా ఉందన్నారు . సబ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా కనెక్షన్ ను పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరారు. దీనిపై వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ పవర్ గ్రిడ్ సంరక్షణను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ తీసుకోవడం నిలిపివేశామన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
ఇదీచదవండి