గురువారం నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రిజర్వేషన్ చేసుకున్న వారికే బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతించనున్నారు. నిర్ణీత ప్రాంతాల మధ్య కొన్ని బస్సులను మాత్రమే నడుపుతున్న ఆర్టీసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో ఏయే ప్రాంతాలకు సర్వీసులు నడపనున్నారో వివరాలు పొందుపరిచింది. apsrtconline.in వెబ్‌సైట్‌లో టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలని సూచించింది.
గురువారం నాడు విజయవాడ-విశాఖ మధ్య 1 ఎసీ, 6 సూపర్ లగ్జరీ బస్సులు నడపనుంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో 18 సీట్లకే రిజర్వేషన్ ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఆర్టీసీ పార్సిల్ ,కొరియర్ సర్వీసులు..
లాక్ డౌన్‌తో రెండు నెలలుగా నిలిచిపోయిన ఆర్టీసీ పార్సిల్ ,కొరియర్ సర్వీసు పునఃప్రారంభం కానున్నాయి. మార్చి 22నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో పార్సిల్ సర్వీసును నిలిపివేసింది. గురువారం నుంచి బస్సులు నడుపుతుండటంతో వీటితో పాటు పార్సిల్ సర్వీసును ప్రారంభించనుంది. ప్రస్తుతానికి రాష్ట్ర పరిధిలో మాత్రమే బస్సులు తిప్పుతున్నందున ఆ ప్రాంతాలకు మాత్రమే పార్సిల్ సర్వీసులు చేరవేయనున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా వినియోగదారులు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆర్టీసీ సూచించింది. మాస్కులు ధరించి బుకింగ్, డెలివరీ కేంద్రాల వద్దకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. చేతులను శానిటైజర్‌తో శుభ్రపరచుకోవడం, భౌతిక దూరం పాటించడానేని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.