ఇప్పటికే ఇసుక ధర అధికంగా ఉందని నిర్మాణదారులు గగ్గోలు పెడుతుంటే, దీని ధరను టన్నుకు రూ.100చొప్పున అదనంగా పెంచాలని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకుంటే టన్నుకు రూ.375 చొప్పున తీసుకుంటున్నారు. రవాణా ఖర్చు అదనం. ఇటీవలి కాలంలో నిర్వహణ ఖర్చులు పెరిగినందున ఈ ధరను సైతం.. రూ.475కు పెంచాలని ఏపీఎండీసీ కోరుతోంది.
ఇది అమలైతే వినియోగదారులపై భారం పెరగనుంది. 6 చక్రాల లారీలో 12 టన్నుల వరకు సరఫరా అవుతుంది. నిల్వ కేంద్రం వద్ద రూ.4,500 ఉండగా... కొత్త ధరలు అమల్లోకి వస్తే రూ.5,700కి చేరనుంది. అలాగే నాలుగున్నర టన్నుల ట్రాక్టర్ ఇసుక (ఒక యూనిట్) రూ.1,687 ఉండగా అది రూ.2,137కి చేరుతుంది. కొత్తగా ప్రతిపాదించిన రూ.100లో తవ్వకాలు, రవాణాకు రూ.50, నిల్వ కేంద్రాలు, రీచ్‌ల్లో వేసిన దెబ్బతిన్న రహదారులకు రూ.20, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో జీతాల కోసం రూ.30 చొప్పున కేటాయించనున్నారు.
రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక వినియోగం ఉంటుందని అంచనా. నదుల నుంచి తవ్వితీసిన ఇసుక కోటి టన్నులు, పట్టా భూముల్లో లభించేది 50 లక్షలు, పూడికల కింద ఉండేది 50 లక్షల చొప్పున లభ్యత ఉంటుందని లెక్కవేశారు.
ఇదీ చదవండి:
వైకాపా పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తోంది: ఎంపీ గల్లా జయదేవ్