APCPS: రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించడాన్ని రాజకీయ నిర్ణయమని ఏపీ ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదమని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు, పార్థసారథి విమర్శించారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు సీఎం జగన్ హామీనిచ్చి మేనిఫెస్టోలో పెట్టడం రాజకీయ నిర్ణయం కాదా? అని ప్రశ్నించారు. జీపీఎస్‌కు వ్యతిరేకంగా ‘నయవంచనపై ధర్మపోరాటం’ పేరుతో శ్రీకాకుళంలో జులై 4న భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబరు 1న 4లక్షల మంది ఉద్యోగులతో విజయవాడలో మిలినియం మార్చ్ నిర్వహిస్తామన్నారు.
ఓపీఎస్ ఒక్కటే ప్రత్యామ్నాయం: ఏపీటీఎఫ్
ఓపీఎస్ విధానం ఒక్కటే ఉద్యోగులకు ప్రత్యామ్నాయమని రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) సబ్‌కమిటీ సూచించింది. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో 100 రోజుల పోరాట కార్యక్రమాలను రూపొందించింది. జూన్ 10-18 వరకు పాత తాలూకా కేంద్రాల్లో ధర్నాలు, జూన్20 నుంచి జులై5 వరకు ప్రజాప్రతినిధులకు విన్నపాలు, జులై11 నుంచి 27వరకు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, 28నుంచి ఆగస్టు 8వరకు సీఎంకు పోస్టుకార్డుల ద్వారా విన్నపాలు, 11న కలెక్టరేట్ల వద్ద పికెటింగ్, 16నుంచి 26వరకు విజయవాడలో రిలే నిరాహార దీక్షలు, చివరి రోజు మహాధర్నా నిర్వహించాలని కమిటీ తీర్మానించింది. సెప్టెంబరు 1న సీపీఎస్ పోరాట సంఘాలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించింది. సమావేశంలో ప్రధాన కార్యదర్శి భానుమూర్తి, ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు పాల్గొన్నారు.
ఓపీఎస్ చేయలేమనడం బాధ్యతారహితమే
ఉద్యోగ సంఘాల సమావేశంలో పాత పింఛన్ పథకం (ఓపీఎస్) పునరుద్ధరణ సాధ్యం కాదని మంత్రుల కమిటీ చెప్పడం బాధ్యతారహితమని ఓపీఎస్ సాధన సమితి జాతీయ నాయకుడు రామాంజనేయులు, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. ‘అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ హామీనిచ్చారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ ఓపీఎస్‌ను అమలుచేస్తోంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లు సీపీఎస్ రద్దు చేశాయి. రాష్ట్రంలో జీపీఎస్‌ను బలవంతంగా రుద్దాలనుకోవడం సమంజసం కాదు. మంత్రుల వ్యాఖ్యలు లక్షలాది ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లాయి’ అని పేర్కొన్నారు.
* జీపీఎస్‌పై మంత్రుల కమిటీ స్పందన నిరాశాజనకమని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం పేర్కొన్నారు.
పోరాటాలతోనే రద్దు: ఎమ్మెల్సీ సాబ్జీ
అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీనిచ్చి మూడేళ్లు గడిచాక కూడా చేతులెత్తేయడం ఉద్యోగులను మోసగించడమేనని ఎమ్మెల్సీ సాబ్జీ విమర్శించారు. ‘ఉద్యమాలు, పోరాటాలతోనే సీపీఎస్ రద్దు సాధ్యం. భవిష్యత్తులో జరిగే పోరాటాలకు పీడీఎఫ్ ఎమ్మెల్సీల మద్దతు ఉంటుంది’ అని తెలిపారు.
ఆశలు వమ్ము: టీఎస్‌యూఎస్
ఓపీఎస్ అమలు అసాధ్యమని మంత్రుల కమిటీ చెప్పడం అన్యాయమని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎస్‌యూఎస్) అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉద్యోగుల ఆశలను వమ్ము చేస్తున్నారని విమర్శించారు.
* జీపీఎస్‌ను ఉద్యోగులపై బలవంతంగా రుద్దవద్దని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముక్కాల అప్పారావు, వెంకట్రావు సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై దీన్ని బలవంతంగా రుద్దితే సహించేది లేదని హెచ్చరించారు.
ఇవీ చదవండి: