ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయిన తెలంగాణ పింఛనుదారులకు రెండేళ్లుగా చేస్తున్న ఐఆర్ అదనపు చెల్లింపులపై ఏపీ ఖజానా శాఖ దృష్టి సారించింది. 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) పొరపాటున వారికీ చెల్లిస్తున్నట్లు ఖజానా శాఖ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ పెన్షనర్ల వివరాలు సేకరించడం ప్రారంభించారు. ఖజానా శాఖ డైరెక్టర్ రాష్ట్రంలోని ఉప ఖజానా కార్యాలయాలు, సబ్ డివిజన్ ఖజానా కార్యాలయాలకు అంతర్గత సర్క్యులర్ పంపారు.
2014 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయిన పెన్షనర్ల సమగ్ర వివరాలు సంబంధిత నమూనాలో పొందుపరిచి ఏప్రిల్ 6 లోగా పంపాలని కోరారు. ఈ విషయంపై ఆర్థిక శాఖకు సమగ్ర నివేదిక పంపినట్లు సమాచారం. 9నెలల కిందటే ఈ అంశంపై చర్చ జరిగిందని, పెన్షనర్ల సమాచారం సేకరించడంలో ఇబ్బందులున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
ఐఆర్ చెల్లింపుల బిల్లుల విషయంలో తప్పులుంటే ఉప ఖజానా అధికారులు గుర్తించి సరిదిద్దాలని సీఎఫ్‌ఎంఎస్ అధికారులు గతంలో మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీని వల్లే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ఉప ఖజానా కార్యాలయాల్లో పొరపాట్లు గుర్తించి, ఐఆర్ నిలిపివేశారని, ఈ అవకాశాన్ని మిగతా చోట్ల పరిశీలించకపోవడంతో చెల్లింపులు సాగాయని చర్చ సాగుతోంది.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు కొత్త పీఆర్సీ అమలు నేపథ్యంలో ఐఆర్ రూపంలో చెల్లించిన అదనపు మొత్తాలు రికవరీ చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు... కరవు భత్యం విషయంలోనూ ఇలాంటి సమస్యలు కొన్ని చోట్ల తలెత్తినట్లు సమాచారం. కొందరు పింఛనుదారులు అధికారులను సంప్రదించి మార్పులు చేయించుకున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: