కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించి ఐక్యత చాటడం గొప్ప విషయమని... గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. భౌతికంగా దూరంగా ఉన్నా, మానసికంగా ఒక్కటేనన్న నినాదంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావడం.... మన దీక్షాదక్షతలను తెలియజేస్తోందన్నారు. రాత్రి 9 గంటల సమయాన రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులు... లైట్లు ఆర్పివేసి దీపాలు వెలిగించారు. రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో మమేకమయ్యారు.
కరోనాపై ఐక్య పోరాటానికి చిహ్నంగా తాడేపల్లి నివాసంలో ముఖ్యమంత్రి జగన్ కొవ్వొత్తులు వెలిగించారు. రాత్రి 9 గంటలకు లైట్లు ఆన్నీ ఆపేసి... కొవ్వొత్తులు, దీపాలు వెలిగించారు. కోవిడ్ –19 పై పోరాటానికి సంఘీభావం తెలిపారు. దేశ ప్రజలంతా ఒక్కటిగా ముందుకు సాగాలని సీఎం సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు... హైదరాబాద్‌లోని నివాసంలో దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేశ్, ఆయన కుమారుడు దేవాన్ష్ పాల్గొన్నారు. కరోనాపై పోరాటంలో కీలకపాత్ర వహిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
దీపాలు వెలిగించే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. గుంటూరులో మేకతోటి సుచరిత, ఆలూరులో గుమ్మనూరి జయరామ్, ధర్మవరంలో శంకర నారాయణ, మార్కాపురంలో ఆదిమూలపు సురేశ్, నెల్లూరులో మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, విశాఖలో అవంతి శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామంలో ధర్మాన్ కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారామ్... ఐక్య పోరాటంలో మమేకమయ్యారు. విశాఖలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కాగడాలు ప్రదర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతలు దివ్వెలు వెలిగించారు. పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజిని... కుటుంబసభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నరసాపురంలో వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడు దీపాలు వెలిగించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అనపర్తి గాంధీ బొమ్మ వద్ద ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి కొవ్వొత్తులు వెలిగించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఎమ్మెల్యే బాబూరావు, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైకాపా నేత కిల్లి కృపారాణి దీపాలు వెలిగించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు భాగస్వాములయ్యారు. కాకినాడలో యనమల రామకృష్ణుడు, విజయవాడలో ఎంపీ కేశినేని నాని, దేవినేని ఉమా, ఎమ్మెల్యే గద్దె రామమోహనరావు , ఆయన సతీమణి అనురాధ దీపారాధన చేశారు. సీనియర్ నేతలు కంభంపాటి రామ్మోహన్‌రావు, అచ్చెన్నాయుడు... కుటుంబ సభ్యులతో కలిసి ప్రమిదలు వెలిగించారు. విశాఖలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అనకాపల్లిలో ఎమ్మెల్యే నాగజగదీశ్వరరావు , కొత్తపేటలో మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, వాడపాలెంలో బండారు సత్యానందరావు, నరసరావుపేటలో అరవిందబాబు, శ్రీకాకుళం జిల్లాలో బగ్గు రమణమూర్తి... దీపాలు వెలిగించి ప్రజల్లో స్ఫూర్తి నింపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్... వెలుగుల కార్యక్రమానికి సంఘీభావంగా ట్విట్టర్‌లో దీపాలు ఉంచారు. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్... సతీమణితో కలిసి కొవ్వొత్తులు వెలిగించారు. కరోనాపై సంఘటిత పోరాటంలో భాగంగా... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో దీప ప్రజ్వలన చేశారు. రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి... కుటుంబ సభ్యులతో కలసి దీపాలు వెలిగించారు. పార్వతీపురంలో భాజపా నేత ఉమామహేశ్వరరావు ఆధ్వర్యాన అఖండ దీపారాధన చేశారు.
విశాఖలో కలెక్టర్ వినయ్‌చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, జీవీఎంసీ కమిషనర్ సృజన... దీపాలు వెలిగించారు. శ్రీకాకుళంలో కలెక్టర్ నివాస్ దంపతులు ఐక్య పోరులో భాగమయ్యారు. నెల్లూరులో కలెక్టర్ శేషగిరిబాబు, ఇతర ఉన్నతాధికారులు... జెడ్పీ కార్యాలయం వద్ద దీపాలు పెట్టారు. విజయవాడ ఏఆర్ మైదానంలో పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు... సంకల్ప జ్యోతి వెలిగించారు.