కౌంటర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 7వ జాతీయ స్థాయి ఈవెంట్లో ఏపీ ఆక్టోపస్ బలగాలు మొదటి స్థానం సాధించటం సంతోషంగా ఉందని డీజీపి గౌతం సవాంగ్ అన్నారు. ఎనిమిది రాష్ట్రాల ఆక్టోపస్ బృందాలతో పోటీ పడి ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఆక్టోపస్‌కు రాష్ట్రంలో పూర్తిస్థాయి శిక్షణా కేంద్రం లేనప్పటికీ.. ప్రథమ స్థానం సాధించడం విశేషమన్నారు. కమెండోలకు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మెరుగైన శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేందుకు ఆక్టోపస్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని డీజీపి తెలిపారు.
గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బలగాలను ఇచ్చేందుకు కేంద్రం సహకరిస్తుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రాష్ట్రంలో వివిధ ర్యాంకుల్లో మొత్తం 500 మంది ఆక్టోపస్ ఆఫీసర్లు ఉన్నారన్నారు. నైట్ ఫైరింగ్ విషయంలో ఏపీ ఆక్టోపస్ అత్యుత్తమ శిక్షణ ఇస్తోందని వ్యక్తిగత విభాగంలో ప్రథమస్థానంలో నిలిచిన ఏపీ కమాండో పాపారావు తెలిపారు.
అపోహలు సృష్టిస్తున్నారు..
గుజరాత్ ముంద్ర పోర్టులో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌కు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని డీఆర్ఐ స్పష్టం చేసినా కొందరు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని డీజీపీ అన్నారు . విజయవాడను కేవలం చిరునామా కోసం మాత్రమే వినియోగించుకున్నారని తాను స్వయంగా స్పష్టం చేసినా ఆరోపణలు ఆపటం లేదన్నారు. ఈ తరహా ఆరోపణలు చేస్తూ రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్నారని డీజీపీ అన్నారు . ప్రజల్లో, యువతలో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆరోపణలు చేస్తున్న వారికి డిఫమేషన్ నోటీసులు పంపామని డీజీపి గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఇదీ చదవండి: