స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పార్టీలోని ముఖ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వార్డుల విభజన, బీసీ జనాభా గణను పూర్తి చేశాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సమాయత్తం అవుతోంది.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు! 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసిలకు 62.03శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రిజర్వేషన్లు 59.85 శాతానికి దిగివచ్చాయి. రెండేళ్ల కిందట సుప్రీం కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బీసీల రిజర్వేషన్ను తగ్గించాల్సి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధిచి త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న 12 వేల 109 పంచాయితీల పదవీకాలం 2018 ఆగస్టులో, ఎంపీపీ, జెడ్పీ, మున్సిపాల్టీల్లో ప్రజాప్రతినిధులకు ఈ ఏడాది జూన్ తో పదవీ కాలం ముగిసింది. సార్వత్రిక ఎన్నికల నాటి ఓటరు జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలంటే డిసెంబర్ నెల తుది గడవు కానుంది. ఇదేసమయంలో గ్రామపంచాయతీలకు మూడు నెల్లలోపు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు . ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..ఇదే విషయాన్ని రాతపూర్వంగా ప్రమాణపత్రం దాఖలు చేయాలని సూచించింది. అందుకు ఏజీ అంగీకరించడంతో తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది ఇదీ చదవండి: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్