సచివాలయంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన శాసన రాజధాని భవనాల అంశంపై ప్రభుత్వం నియమించిన కమిటీ సమావేశమైంది. భవనాలు ఎంతవరకు పూర్తయ్యాయో ఏఎంఆర్డీఏ ఈ సమావేశంలో నివేదిక సమర్పించింది. అసంపూర్తి భవనాల కోసం 2 వేల 154 కోట్లు అవసరమని అంచనా వేసింది. ప్రస్తుతం కాంట్రాక్టర్ల చెల్లింపుల కోసం 300 కోట్లు అవసరమని తేల్చింది.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం కడుతున్న భవనాల్లో 288 ఫ్లాట్లు 74 శాతం మేర పూర్తయినట్లు పేర్కొంది. అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాల నిర్మాణంలో చేపట్టాల్సిన 144 ఫ్లాట్లల్లో 74 శాతం మేర నిర్మాణాలు పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఎన్జీఓ హౌసింగులోని 19వందల 68 ఫ్లాట్లల్లో 62 శాతం మేర పూర్తి అయ్యినట్లు ఏఎంఆర్డీఏ పేర్కొంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల టైప్-1 భవనం నిర్మాణంలో 384 ఫ్లాట్లకు గానూ..58 శాతం పూర్తి చేసినట్లు తెలిపింది. ప్రభుత్వ ఉన్నతాధికారుల టైప్-2 భవనం నిర్మాణంలో 336 ఫ్లాట్లకు గానూ 64.2 శాతం మేర పనులు జరిగాయని వెల్లడించింది.
గ్రూప్-డి హౌసింగ్ భవనం నిర్మాణంలో 720 ఫ్లాట్లకు గానూ 75 శాతం పని జరిగిందని పేర్కొన్న ఏఎంఆర్డీఏ.. మంత్రులు, జడ్జీలకు 35 బంగ్లాలు చొప్పున నిర్మించాల్సి ఉండగా..27 శాతం మేర పని జరిగినట్లు స్పష్టం చేసింది. ముఖ్య కార్యదర్శులకు చెందిన 25 బంగ్లాల నిర్మాణంలో 23 శాతం పని అయ్యిందని తెలిపింది. కార్యదర్శులకు చెందిన 90 బంగ్లాల నిర్మాణంలో 23 శాతం మేర పనులు చేసినట్లు వెల్లడించింది. సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం నిర్మాణం 77 శాతం పూర్తి చేసినట్లు స్పష్టం చేసింది.
హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు మొదలుకాలేదని..జ్యూడిషియరీ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి అయినట్లు ఏఎంఆర్డీఏ వెల్లడించింది. 70 శాతానికి పైగా పూర్తైన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అభిప్రాయపడిన కమిటీ...మార్చి రెండో వారంలో రెండో సారి భేటీ కావాలని నిర్ణయిం తీసుకొంది. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఆర్థిక, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు, అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి...
శాసన రాజధాని భవనాల కోసం కమిటీ