సుదీర్ఘ కాలం తరువాత రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఏర్పాటైనా కార్యాలయం లేకుండానే ఛైర్మన్, సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కమిషన్ ఛైర్మన్‌గా ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారాంమూర్తి, జ్యుడిషియల్ సభ్యుడిగా మాజీ జిల్లా జడ్జి డి.సుబ్రహ్మణ్యం హైదరాబాద్‌లోని తమ నివాసాల్లో బాధ్యతలు స్వీకరించారు. నాన్‌జ్యుడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాకులో బాధ్యతలు స్వీకరించారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉమ్మడిగానే మానవహక్కుల కమిషన్ కొనసాగుతూ రెండు రాష్ట్రాలకూ సేవలందించేది. 2015 ఆగస్టులో సభ్యులు పెద్దపేరిరెడ్డి, మిర్యాల రామారావు పదవీవిరమణ చేయగా, 2016 డిసెంబరులో ఛైర్మన్ జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ పదవీవిరమణ చేశారు. ప్రస్తుత ఏపీ రాష్ట్ర కమిషన్ సభ్యుడు డి.సుబ్రహ్మణ్యం ఉమ్మడి కమిషన్ కార్యదర్శిగా కొంతకాలం కొనసాగారు. 2017, 2018ల్లో రెండు రాష్ట్రాలకూ కమిషన్ లేకపోవడంతో తెలంగాణ హైకోర్టు జోక్యంతో 2019 డిసెంబరులో తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఏర్పాటైంది. ముందుగా తెలంగాణ కమిషన్ ఏర్పాటు కావడంతో ఉమ్మడి కమిషన్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి కమిషన్ సిబ్బంది విభజన కూడా జరగకపోవడంతో ఉద్యోగులూ అక్కడే పనిచేస్తున్నారు. తెలంగాణ హక్కుల కమిషన్ బోర్డు ఉన్నా.. ఏపీ హక్కుల కమిషన్ బోర్డునూ అలాగే ఉంచింది. ప్రస్తుతం ఏపీలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఏర్పాటైంది. అయితే కార్యాలయం విషయాన్ని ప్రభుత్వం నిర్ణయించకపోవడంతో ఛైర్మన్‌తో పాటు సభ్యులు ఇంటి వద్దనే బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కమిషన్ వద్ద ఇప్పటికి నాలుగైదు వేలకుపైగా కేసులు పరిశీలనలోనే ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: పురపాలికల్లో ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్లు