మద్యం , ఇసుక విషయంలో అక్రమాలను నిరోధించేందుకు కొత్త డిపార్ట్ మెంట్ ' స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది . ఇదే అంశంతో కూడిన మరో వ్యాజ్యంతో కలిపి గురువారం విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.
ప్రస్తుతం ఉన్న చట్టాలు, నిబంధనలను సవరించకుండా... ఎక్సైజ్, పోలీసు శాఖలకు చెందిన అధికారులతో కొత్త శాఖను ఏర్పాటు చేయడానికి వీల్లేదని... ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన పి . శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేస్తూ మే 9న సాధారణ పరిపాలనశాఖ జారీచేసిన జీవో 41, తదనంతరం జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి , స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఎక్స్ అఫిషియో ముఖ్య కార్యదర్శి , ఎక్సైజ్ కమిషనర్ , ప్రత్యేక ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కమిషనర్ ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పిటీషనర్ పేర్కొన్నారు.
పిటిషనర్ లేవనెత్తిన అంశాలు
ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటు.... రాజ్యాంగ నిబంధనలు, ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ -1975 , ఏపీ ఎక్సైజ్ చట్టం -1968 , ఏపీ ప్రభుత్వం బిజినెస్ రూల్స్ -2018 కి విరుద్ధంగా ఉంది. అవసరం అయితే ప్రస్తుతం ఉన్న చట్టాల్ని సవరించి కొత్త చట్టం తెస్తామని జీవో 41 లో పేర్కొన్నా... ఆ ప్రక్రియ పూర్తికాక ముందే కొత్త శాఖ ఏర్పాట చేయడం, ఆ విధులు నిర్వర్తించడం సరికాదు. న్యాయబద్ద అనుమతి లేకుండా ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో విధులు నిర్వర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తోంది. కొత్త డిపార్ట్మెంట్ చర్యలన్నీ చట్ట విరుద్ధమవుతాయి. ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో న్యాయబద్ధంగా ఏర్పాటు కానప్పుడు...వారు నమోదు చేసిన కేసులు న్యాయ పరీక్షలో నెగ్గవు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జీవో 41 అమలును నిలుపుదల చేయండి ' అని పిటిషనర్ కోరారు.
జీవో 41లో
మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారీ నిలువరింత , ఇసుక అక్రమ రవాణాను నిరోధించడం కోసం సాధారణ పరిపాలనశాఖలో భాగంగా ప్రత్యేక బ్యూరోను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్స్ అఫిషియో ముఖ్య కార్యదర్శిగా, ఆ విభాగానికి అధిపతిగా డీజీపీ వ్యవహరిస్తారు. ఆయనకు సహకారం అందించేందుకు మధ్య స్థాయి అధికారి ఒకరు, ఒక సహాయ కార్యదర్శి ఉంటారు. బ్యూరోకు కమిషన్రేట్ ఉంటుంది. ప్రతి జిల్లాలో అదనపు ఎస్పీ , ఏఎస్పీతో బ్యూరో ఉంటుందని జీవో 41 లో పేర్కొన్నారు .
ఇదీ చూడండి: అనర్హత పిటిషన్ విచారణకు ఎమ్మెల్సీలు గైర్హాజరు