High Court on encroachments: ప్రభుత్వ భూములు, చెరువుల, నదులు, కాలువలు, స్మశానవాటికల స్థలాలను ఆక్రమించిన వారందరినీ ఖాళీ చేయిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూముల్లో 30-40 ఏళ్ల కిందట చేపట్టిన నిర్మాణాలను సైతం కూల్చివేయాల్సిందేనని పేర్కొంది. ఆక్రమణదారులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అవుతున్నారని, దీంతో ఆక్రమణలు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. తమ ఆదేశాల ప్రకారం వాటిని తొలగించడానికి అధికారులు చర్యలు చేపడితే.. కొందరు హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యాలు వేసి స్టే ఉత్తర్వులు పొందుతున్నారని తెలిపింది.
ధర్మాసనం ఆదేశాలతో ఆక్రమణలు తొలగిస్తున్నట్లు అధికారులు.. సింగిల్ జడ్జి దృష్టికి తీసుకురాకుండా ఆక్రమణదారులకు సహకరిస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించింది. ఈ వ్యవహారమై దాఖలైన వ్యాజ్యాలను ప్రభుత్వ భూములు, రహదారులు, చెరువులు, నీటి వనరులు, శ్మశానవాటికల స్థలాల వారీగా విభజించింది. విచారణకు వివిధ తేదీలను ఖరారు చేసింది. వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలిస్తామంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, సరస్సులు, కుంటలు, నదుల స్థలాల ఆక్రమణల తొలగింపు దిశగా హైకోర్టు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. నీటి వనరుల ఆక్రమణలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తేల్చి చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి సంగతిని తేలుస్తామని పేర్కొంటూ ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా మలిచిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంతో పాటు ఆక్రమణలను సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలైన మరో 55 వ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.
ఆక్రమణలో అయిదు వేల ఎకరాలు: ప్రభుత్వ న్యాయవాది (జీపీ) సుభాష్ వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి. 30-40 ఏళ్ల కిందటే నిర్మాణాలు చేపట్టారు. వాటి విషయంలో ఏవిధంగా ముందుకెళ్లాలన్న దానిపై స్పష్టత ఇవ్వాలి...’ అని కోరారు. అలాంటి నిర్మాణాలను సైతం కూల్చేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన క్రమబద్ధీకరణ పథకం కింద అర్హులు కాని వారందరూ ఆక్రమణదారులవుతారని తెలిపింది. న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపిస్తూ.. వినుకొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను మున్సిపాలిటీ ఆక్రమించిందన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది.
హక్కులను సాకుగా చూపి ఆక్రమిస్తామంటే ఎలా?: న్యాయవాది విద్యావతి వాదనలు వినిపిస్తూ.. గ్రామకంఠం భూముల్లో పిటిషనర్లు నివాసాలు ఏర్పాటు చేసుకుని 30 ఏళ్లకుపైగా జీవనం సాగిస్తున్నారన్నారు. వారి విషయంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు విఘాతం కలగకుండా రక్షణ కల్పించాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను సాకుగా చూపి ప్రభుత్వ భూములు ఆక్రమిస్తామంటే ఎలా అని ప్రశ్నించింది. అధికారులు ముందస్తు నోటీసులు ఇచ్చి, వాదనలు వినిపించేందుకు అవకాశం ఇచ్చాకే కూల్చివేతల విషయంలో ముందుకెళతారని, ఆందోళన అవసరం లేదంది.
శ్మశానంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఏమిటి?: మరో న్యాయవాది పీటా రామన్ వాదనలు వినిపిస్తూ.. గుంటూరులో శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని కోర్టు దృష్టికి తెచ్చారు. శ్మశానంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఏమిటని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
కరకట్ట వద్ద నిర్మాణాల విషయాన్ని విచారించండి: ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ.. ‘హైకోర్టుకు వచ్చే మార్గంలో కృష్ణానది పక్కన కరకట్టను ఆనుకుని నిర్మాణాలున్నాయి. వాటి విషయంలో గతంలో నోటీసులు ఇచ్చాం. దీనిపై హైకోర్టులో పది వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి...’ అని వివరించారు. వాటిని ప్రస్తుత వ్యాజ్యాలతో కలిపి విచారించాలని కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించింది.
అమలు చేస్తేనే కదా లోటుపాట్లు తెలిసేది: పాఠశాలల విలీనంపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని అమలు చేస్తేనే కదా.. అందులోని లోటుపాట్లు తెలిసేది అని పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. జీవోపై స్టే ఇస్తే మొత్తం ప్రక్రియ నిలిచిపోతుందని తెలిపింది. ప్రస్తుతం జీవోపై స్టే ఇవ్వలేమని పేర్కొంది. కౌంటరు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ బి.రమేశ్ చంద్ర సింహగిరి పట్నాయక్ తాజాగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఇవీ చదవండి: