సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరికొందరు హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ద్వారా అనుచిత లబ్ధి పొందడంలో ముఖ్యమంత్రి జగన్ విజయవంతమయ్యారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్‌కుమార్ పేర్కొన్నారు. ‘ఆ లేఖ వల్ల ఏపీ సీఎం అంతిమంగా ఊరట పొందుతారో లేదో తెలీదు గానీ.. దాని వల్లే ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీ జరిగిందని ప్రజలు భావించే అవకాశముంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసు విచారణ నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ వైదొలగాలంటూ.. ఆ సంస్థ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. హైకోర్టుపైనా, న్యాయమూర్తులపైనా సామాజిక మాధ్యమాల్లో అశ్లీల, అనుచిత వ్యాఖ్యలు ప్రచారం చేయడంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో.. సీఎం రాసిన లేఖను అక్టోబరు 10న సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం మీడియాకి వెల్లడించారని, కొద్దిసేపట్లోనే ఆ సమాచారం దావానలంలా వ్యాపించిందని జస్టిస్ రాకేష్‌కుమార్ పేర్కొన్నారు.
3 రాజధానులపై విచారణ మొదటికొస్తుందేమో!
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయడం వల్ల సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్‌పై కేసుల విచారణలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని, వాటిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణకూ అవరోధం ఏర్పడవచ్చని జస్టిస్ రాకేష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ‘ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ వల్లా ముఖ్యమంత్రికి అనుచిత లబ్ధి చేకూరుతుంది. మూడు రాజధానులు ఆయన మానస పుత్రిక అని అందరికీ తెలిసిందే. రాజధాని నిర్మాణానికి పేద రైతులు భూములిస్తే... 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక దాన్ని నిలిపివేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై జస్టిస్ జె.కె.మహేశ్వరి నేతృత్వంలోని ఫుల్‌బెంచ్ నెల రోజులకు పైగా తుది విచారణ జరిపింది. సీఎం లేఖ తర్వాత జస్టిస్ మహేశ్వరిని బదిలీ చేయడంతో విచారణ నిలిచిపోయింది. కొత్త బెంచ్ వేయడానికి కొంత సమయం పడుతుంది. విచారణ మొదటి నుంచీ ప్రారంభించాల్సి రావచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
కొలీజియం నిర్ణయంలో పారదర్శకత ఉండాలి
‘ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీల్ని నేను ప్రశ్నించడం లేదు. కానీ అలాంటి నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా సుప్రీంకోర్టు కొలీజియంలోని సభ్యుల మాదిరిగా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారే’ అని రాకేష్‌కుమార్ పేర్కొన్నారు. మూడు రాజధానులకు అనుగుణంగా శాసనసభలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించనందుకు ఏకంగా శాసనమండలి రద్దుకే సిఫారసు చేసిన ఏకైక ప్రభుత్వం ఇదే కావచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయనందుకు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌నూ వాళ్లు విడిచి పెట్టలేదన్నారు.
ఎంపీపై ఫిర్యాదు చేసినా కేసు పెట్టలేదు
‘రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొన్ని తప్పుడు, సహేతుకత లేని ఉత్తర్వుల్ని.. పౌరుల హక్కుల్ని కాపాడే క్రమంలో హైకోర్టు కొట్టేసింది. వాటిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి నిర్బంధ బోధన మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టే ఉత్తర్వు ఒకటి. దాన్ని కోర్టు కొట్టేసిన మరుక్షణం నుంచి.. కొందరు హైకోర్టుపైనా, ఒక న్యాయమూర్తిపైనా అశ్లీల, అభ్యంతరకర, అగౌరవమైన భాషలో సామాజిక మాధ్యమాల్లో వెల్లువలా పోస్టులు పెట్టారు. వాటిపై సీఐడీ ఎస్పీ సారథ్యంలోని సైబర్‌క్రైమ్ విభాగానికి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఆసక్తి చూపలేదు. ఆ వ్యవహారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తతపై 2020 మేలో హైకోర్టు మళ్లీ ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత అధికార పార్టీ మద్దతుదారులమని ప్రకటించుకున్నవారు, స్వయంగా ఆ పార్టీ ఎంపీ ఒకరు హైకోర్టుపైనా, జడ్జిలపైనా విరుచుకుపడ్డారు. ఎంపీ నందిగం సురేష్ స్వయంగా వాళ్ల పార్టీ కార్యాలయంలోనే మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత మే 24న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ 19 మంది పేర్లతో మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు మే 26న రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వాటిలో ప్రధాన నిందితుడైన ఎంపీ పేరు లేదు. నిందితుణ్ని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారు. కేసు దర్యాప్తులోనూ ఎలాంటి పురోగతీ లేదు. అదే సమయంలో ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నవారికి వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్లు, పోస్టులు పెడితే మాత్రం పోలీసులు వెంటనే కేసులు పెడుతున్నారు. అరెస్టులూ చేస్తున్నారు.
సీఎం లేఖతో అధికారులకు ధైర్యం వచ్చింది
‘ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి సంబంధించిన కేసులో తుది విచారణ మొదలవకముందే అవాంఛనీయ రీతిలో ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలైంది. డివిజన్ బెంచ్ సభ్యునిగా ఉన్న న్యాయమూర్తిపై ఒక ఐఏఎస్ అధికారి క్రూరమైన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనా, మరికొందరు న్యాయమూర్తులపైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి లేఖ రాసి, దాన్ని బహిర్గతం చేసిన తర్వాత ప్రభుత్వ అధికారులకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది’ అని జస్టిస్ రాకేష్‌కుమార్ వ్యాఖ్యానించారు.
ఇన్నేళ్లయినా అభియోగాలు నమోదు చేయరా?
ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణను సత్వరం పూర్తి చేయాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ముగ్గురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. తర్వాత ఒక్కరోజుకే జగన్‌పై ఉన్న ఏడెనిమిది క్రిమినల్ కేసుల్ని రాష్ట్ర పోలీసులు క్లోజ్ చేశారని జస్టిస్ రాకేష్‌కుమార్ పేర్కొన్నారు. ‘2020 సెప్టెంబరు వరకు సుమారు 30కిపైగా కేసుల్లో జగన్ నిందితుడిగా ఉన్నారు. సీబీఐ దాఖలు చేసిన 11 కేసుల్లో జగన్ నిందితుడు. వాటిలో చాన్నాళ్ల క్రితమే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. ఆయన తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపణలున్నాయి. వాటికి సంబంధించి ఈడీ దాఖలు చేసిన పలు కేసుల్లోనూ జగన్ నిందితుడు. ఆ కేసులు 2011 నుంచీ పెండింగ్‌లో ఉన్నా.. అభియోగాలు నమోదు కాకపోవడం వ్యవస్థపై గొడ్డలిపెట్టు కాదా’ అని వ్యాఖ్యానించారు.
ఖైదీ నం.6093 అని కొడితే..
‘ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రచురితమయ్యే వరకు ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు. ఆ లేఖ తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరిగింది. గూగుల్‌లో ఖైదీ నంబర్ 6093 అని కొడితే చాలా సమాచారం వస్తుందని ఎవరో చెప్పారు. నేను అలా చేసేసరికి దిగ్భ్రాంతి కలిగించే సమాచారం లభించింది. నేను డౌన్‌లోడ్ చేసిన సమాచారాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆ తర్వాత కొంత సాధికారిక సమాచారం తెప్పించుకున్నాను. జగన్‌పై 11 సీబీఐ కేసులు, 6 ఈడీ కేసులు, ఐపీసీ సెక్షన్ కింద నమోదు చేసిన మరో 18 కేసులు ఉన్నట్టు తెలిసింది (ఆ జాబితాలను పొందుపరిచారు). ఆ కేసులన్నీ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఒకరోజు వాటిలో కొన్ని తప్పుడు కేసులని, వాస్తవాల నమోదులో పొరపాటు జరిగిందని, చర్యలు నిలిపివేశామన్న కారణాలతో పోలీసులు వాటిని మూసేశారు’ అని ఆయన పేర్కొన్నారు.
న్యాయమూర్తుల బాధ్యతా ఉంది
‘నా పదవీకాలం చివరి రోజుల్లో నా నిష్పాక్షికతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నించింది. దానికి వివరణ చెప్పాలి కాబట్టే అన్నీ రికార్డు చేస్తున్నాను. న్యాయవ్యవస్థ హుందాతనాన్ని పరిరక్షించడమే నా లక్ష్యం. న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా, సచ్ఛీలంగా, నిజాయతీగా, పక్షపాతరహితంగా ఉండాలన్న భావనకు కొంత విఘాతం కలగడానికి మేం కూడా కొంత కారణమే. చాలా సందర్భాల్లో న్యాయమూర్తులుగా పదవీవిరమణ చేసిన వెంటనే వారికి వేరే పోస్టు లభిస్తోంది. కనీసం ఏడాది పాటైనా అలాంటి పదవులేమీ తీసుకోకుండా మేం సంయమనం పాటించాలి. అప్పుడు మమ్మల్ని ఎవరూ ప్రభావితం చేయలేరు’ అని జస్టిస్ రాకేష్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
జస్టిస్ రాకేష్‌కుమార్ వ్యాఖ్యలపై సుప్రీంకు వెళతాం
‘హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’ అని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: తిరుపతిలో భార్యకు ఖరీదు కట్టిన శాడిస్టు భర్త