పశుసంవర్థక శాఖకు చెందిన భూమిని వెనక్కి తీసుకొని ఇళ్ల పట్టాలు ఇచ్చి.. అందులో రహదార్లు వేయబోతున్నారని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. గోశాల నుంచి తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మరోచోట భూమి ఇస్తుందేమో చూద్దామని పేర్కొంది. గో సంక్షేమమే కాకుండా ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉందని వ్యాఖ్యానించింది. ప్రజలకు ఇళ్లు, రహదారులు, ఇతర సౌకర్యాలు ఉండాలని తెలిపింది. రహదార్లు వేస్తేనేకదా అభివృద్ధి జరిగేదని పేర్కొంది.
వైఖరి తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోశాలకు చెందిన ఐదెకరాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు ఆ భూముని వెనక్కి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ జి.దొరబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆ భూమిని తిరిగి గోశాలకు అప్పగించేలా ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే ఆ భూమిలో డిసెంబర్ 25న ఇళ్ల పట్టాలిచ్చారన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రసాదబాబు స్పందిస్తూ.. ఆ భూమిలో రహదార్లు ఏర్పాటు చేయబోతున్నారన్నారు. ఆ ప్రక్రియను నిలువరించాలని కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవద్దనేందుకు ఆ భూమి పవిత్రస్థలానికి చెందింది కాదుకదా అని ప్రశ్నించింది.
ఇదీ చదవండి: నేడు ఆర్థిక వేత్తలతో ప్రధాని మోదీ భేటీ