HIGH COURT ON ELECTIONS IN CAPITAL AMARAVATI AREA: రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు, సీఆర్డీఏ(CRDA) చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ విషయంలో తాజా సమాచారం కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని రాజధాని ప్రాంత గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది.
పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది.. ఎన్నికలు నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నా..ప్రభుత్వం పరిపాలన పరమైన సహకారం అందించాని ఎస్‌ఈసీ చెబుతోందన్నారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం.. ప్రభుత్వ వాదనతో గొంతు కలపడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది..సీఆర్డీఏ చట్టం ప్రకారం అమరావతి పరిధిలోని గ్రామాలు పురపాలక ప్రాంతం పరిధిలోకి వచ్చాయన్నారు. వాటిని రాజధాని నగర ప్రాంతాలుగా గుర్తిస్తూ 2014 లో ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు.
ప్రభుత్వం వాదనలపై స్పందించిన న్యాయమూర్తి.. రాజధాని గ్రామాలను పురపాలక ప్రాంతానికి చెందినవిగా భావిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికలు జరిగినప్పుడు నేలపాడు పరిధిలో ఉన్న హైకోర్టుకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు.
గ్రామపంచాయతీలుగా వీటిని పరిగణిస్తున్నారు కాబట్టే..హైకోర్టుకు ఆరోజు సెలవు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఎస్‌ఈసీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది..ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. హైకోర్టులో కేసులు పెండింగ్ , కొన్నింటిలో మధ్యంతర ఉత్తర్వులు ఉన్న కారణంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమని ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు . ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వం నుంచి పరిపానలపరమైన సంసిద్ధత అవసరం అన్నారు.
ఇదీ చదవండి:
HIGH COURT: జీవో 59 ఉపసంహరించుకుంటాం..హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది