గతేడాది జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు తీవ్ర అడ్డంకులు కలిగిన నేపథ్యంతో తాజా నోటిఫికేషన్ ఇచ్చేలా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని జనసేన బుధవారం హైకోర్టులో వాదనలు వినిపించింది. ఏపీ పంచాయతీరాజ్(కాండక్ట్ ఆఫ్ ఎలెక్షన్స్) నిబంధన 16 ప్రకారం.. ఒకే నామినేషన్ వచ్చిన చోట ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి(ఆర్‌వో) ఫాం-10 ఇచ్చినంత మాత్రాన ప్రక్రియ పూర్తయినట్లు కాదని పేర్కొంది. ఆ వివరాలు ఎస్‌ఈసీకి చేరినప్పుడే వాటికి విలువ ఉంటుందని జనసేన కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు(పిటిషనర్) తరఫు న్యాయవాది వి.వేణుగోపాల్‌రావు కోర్టుకు నివేదించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో అధికార పార్టీ చర్యలతో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని 2020 మార్చి 18న రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. కేంద్రానికి నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు. ఆ నివేదిక ఆధారంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకునేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని అభ్యర్థించారు. అసాధారణ సంఖ్యలో ఏకగ్రీవాలైన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గతేడాది మార్చి 7న నోటిఫికేషన్ ఉనికిలోనే ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియను సవాలు చేస్తూ వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకునేలా ఎస్‌ఈసీని ఆదేశించాలన్న పిటిషనర్ అభ్యర్థనపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు స్పందిస్తూ.. ఆ తరహా సూచన చేయలేమని స్పష్టంచేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలతో కలిపి ప్రస్తుత వ్యాజ్యాన్నీ విచారిస్తామంటూ సోమవారానికి వాయిదా వేశారు.
పథకాలు నిలిపేస్తామని బెదిరిస్తున్నారు
అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిలిపివేస్తామంటూ మహా విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్(జీవీఎంసీ) పరిధిలోని వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు బెదిరిస్తున్నారని, ప్రభుత్వం వారికి ఇచ్చిన అధికారిక ఫోన్లను దుర్వినియోగం చేస్తున్నారని దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు బుధవారం ఈమేరకు ఆదేశాలిచ్చారు. జీవీఎంసీ పరిధిలో వాలంటీర్లు అధికారిక ఫోన్లను దుర్వినియోగం చేస్తున్నారని, పురఎన్నికలు ముగిసే వరకూ వాటిని సీజ్ చేయాలని కోరుతూ విశాఖ తూర్పు తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రణతి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి వివరాలు సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించారు.
ఇదీ చదవండి: 12 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు