పాత గుంటూరు ఠాణాపై దాడి కేసులో ముస్లిం యువకులపై నమోదైన ఆరు ఎఫ్‌ఐఆర్‌లలో ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించేందుకు హోంశాఖ ఈ ఏడాది ఆగస్టు 12న జారీ చేసిన జీవో 776ను హైకోర్టు సస్పెండు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో యథాతథ స్థితిని పాటించాలని అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, గుంటూరు ఎస్పీ, పాతగుంటూరు ఠాణా ఎస్‌హెచ్‌వోలకు నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యంలో ఇప్పటికే సీబీఐ ప్రతివాదిగా ఉండగా.. జాతీయ దర్యాప్తు సంస్థనూ ప్రతివాదిగా చేర్చాలని పిటిషనరుకు మౌఖికంగా సూచించింది. విచారణను అక్టోబరు 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
2018 మే 15న పాతగుంటూరు ఠాణాపై దాడి చేసి, పోలీసులను గాయపరిచిన ఘటనలో ముస్లిం యువకులపై నమోదైన కేసులను డీజీపీ ఆదేశాలతో ఉపసంహరించుకునేందుకు ఇచ్చిన జీవో 776ను రద్దుచేయాలని కోరుతూ పసుపులేటి గణేశ్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో జీవోను పరిశీలించిన ధర్మాసనం.. ‘ముస్లిం యూత్’ అని పేర్కొనడంపై ఆగ్రహించింది. ఆ పదాలను ప్రస్తావించడంపై నిలదీసింది. జీవో తప్పుడు ఉద్దేశాన్ని సూచిస్తోందని తెలిపింది. దర్యాప్తును స్వతంత్ర సంస్థకు మార్చేందుకు డీజీపీ ఉద్దేశం చాలంటూనే ఇకపై ఇలా వ్యవహరించొద్దని హోంశాఖకు, డీజీపీకి సలహా ఇవ్వాలని జీపీకి సూచించింది.
ఇదీ చదవండి: వివేకా హత్యకేసు: సెటిల్మెంట్లు, స్థిరాస్తి గొడవలపై సీబీఐ ఆరా