రాజధాని ప్రాంతంలో నిర్మించిన భవనాలను వినియోగించకపోతే.. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసినట్లు అవుతుందని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ కోణంలో కూడా ఆలోచించాలని అభిప్రాయపడింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దు, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం తదితర అంశాలపై వేసిన వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. మొత్తం 32 వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి.
రాజధాని ప్రాంతంలో సుమారు 52 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, క్వార్టర్స్, రోడ్లు తదితర నిర్మాణాలు మొదటి విడతలో చేపడుతున్నట్లు సీఆర్డీఏలో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లిన పిటిషనర్ తరఫు న్యాయవాది... వేల మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో హఠాత్తుగా పనులు నిలిపివేశారని.. పనులు ఆపేందుకు మౌఖిక, లిఖితపూర్వక ఉత్తర్వులు ఎవరు ఇచ్చారు..? అలా ఎలా నిలిపివేస్తారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని భవనాలు 70శాతం, కొన్ని భవనాలు 80శాతం పనులు పూర్తిచేసుకున్నాయని వాదనలు వినిపించారు. ఈ విధంగా చేస్తే కోట్ల రూపాయలు వృథా అవుతాయన్నారు.
అది ప్రజల సొమ్ము
దీనిపై స్పందించిన న్యాయస్థానం నిర్మించిన భవనాలను వినియోగించుకోకపోతే ప్రభుత్వమే కాదు.. ప్రజల సొమ్ము వృథా అయినట్లే కదా అని వ్యాఖ్యానించింది. భవనాల నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి..? నిర్మాణాలకు ఎంత ఖర్చు చేశారు.. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై అకౌటెంట్ జనరల్‌తో చర్చించి సమాచారం తీసుకోవాలని సూచించింది. గత విచారణలో అకౌంటెంట్ జనరల్‌ను కూడా ఈ వ్యాజ్యంలో జత చేసిన విషయం తెలిసిందే.
హైకోర్టుకు శాశ్వత భవనాలు నిర్మించాలని వేసిన పిటిషన్‌పై పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్ ఎన్వీ ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు. 2018లో హైకోర్టు భవనం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని.. ఒకసారి చెప్పిన తర్వాత భవన నిర్మాణం పూర్తి చేయటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై దాఖలు చేసిన పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని వేసింది. కమిటీ రిపోర్ట్‌ను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. 2015లో ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని అమరావతిగా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీలేదని అఫిడవిట్లో పేర్కొంది. రాజధాని అంశాలపై వ్యాజ్యాలను విచారణ జరిపిన న్యాయస్థానం... తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: