కృష్ణా జిల్లా నందిగామలోని గాంధీ కూడలి వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించకుండా ..జాతీయ, రాజకీయ నేతల విగ్రహాలను మాత్రమే తరలించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అన్ని విగ్రహాలను సమాన దృష్టితో చూడాలని తేల్చి చెప్పింది. విగ్రహాల తొలగింపులో అమోదయోగ్యమైన పరిష్కారం చూపకుంటే...పరిశీలన చేసి నివేదిక ఇచ్చేందుకు కమిషన్‌ను నియమిస్తామని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ స్థలాలు, రహదారులపై విగ్రహాలు ఏర్పాటు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పరిష్కారమార్గం విషయంలో ప్రభుత్వ స్పందన కోసం విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.
నందిగామ గాంధీ కూడలి వద్ద వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తరలించకపోవడాన్ని సవాలు చేస్తూ రామకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు. గాంధీ, రాజకీయ నాయకుల విగ్రహాలను ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలోకి తరలించారని పిటిషనర్ న్యాయవాది ప్రభాకరరావు వాదనలు వినిపించారు. ఆసుపత్రి స్థలంలో విగ్రహాల ఏర్పాటు చట్ట విరుద్ధమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం రహదారి మార్జిన్‌లో ఉందన్నారు. ఆ విగ్రహాన్ని అధికారులు తరలించడం లేదన్నారు. వైఎస్ విగ్రహం ఉండడం వల్ల.. రహదారి విస్తరణ పనులను నిలిపేశారన్నారు. విగ్రహాల తొలగింపులో రెవెన్యూ , మున్సిపల్ అధికారులు వివక్ష చూపుతున్నారన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.
వైఎస్ విగ్రహం రహదారులు, భవనాల శాఖకు చెందిన స్థలంలో లేదని.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రహదారిపై లేని ప్రాంతంలో విగ్రహాన్ని తొలగించాలని పిటిషనర్ కోరుతున్నారన్నారు. వైఎస్ విగ్రహం వల్ల ప్రజలకు అసౌకర్యం లేదన్నారు. పిటిషనర్ స్థానిక తెదేపా నాయకుడని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం పిల్ వేశారన్నారు. రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న 14 విగ్రహాలను తొలగించేందుకు మున్సిపాలిటీ తీర్మానం చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు.
వాదనలు విన్న న్యాయస్థానం రాజకీయ వ్యవహారంతో తమకు సంబంధం లేదని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రహదారులపై విగ్రహాల ఏర్పాటు సరికాదంది. ప్రతిపక్షంలో ఉన్నవారే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లే రేపు అధికారంలోకి రావచ్చని.. అదే ప్రజాస్వామ్యమని పేర్కొంది. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు భవిష్యత్తులో పిటిషనర్లుగా మారి విగ్రహాల తొలగింపునకు ఇలాంటి వ్యాజ్యాలు దాఖలు చేస్తారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో విగ్రహాలన్నింటిని సమాన దృష్టితో చూసి.. వాటి తొలగింపునకు పరిష్కార మార్గం ప్రభుత్వమే చెప్పడం ఉత్తమం అని పేర్కొంది.
ఇదీ చదవండి: కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై గవర్నర్‌తో సీఎం చర్చ.. రేపు మంత్రుల రాజీనామా !