పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటన కేసులు ఎన్ఐఏ చట్టంలోని షెడ్యూల్ నేరాల జాబితా కిందకురావని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయవాది పేర్కొనడంపై..... ఏపీ హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఎఫ్ఐఆర్లు చూసి షెడ్యూల్ నేరాల కిందకు రావనే నిర్ణయానికి ఎలా వస్తారని... తాము ఆదేశిస్తే దర్యాప్తు చేయరా..? అని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలకు కట్టబడి ఉంటామని ప్రత్యేక పీపీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్.. దస్త్రంలోకి చేరకపోవడంతో విచారణను ఈనెల18కి హైకోర్టు వాయిదా వేసింది.
హైకోర్టు కంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎక్కువా..?
2018 మే లో పాత గుంటూరు పోలీసు స్టేషన్ పై దాడి కేసులో..ముస్లిం యువకులపై నమోదైన 6 ఎఫ్ఐఆర్లకు సంబంధించిన ప్రాసిక్యూషన్.. ఉపసంహరించే నిమిత్తం రాష్ట్ర హోంశాఖ..ఈ ఏడాది ఆగస్టు12న జీవో జారీ చేసింది. ఆ జీవోను గణేశ్ అనే వ్యక్తి.... సవాల్ చేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... కోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏను ప్రతివాదిగా చేరుస్తూ ఇంప్లీడ్ పిటిషన్ వేశామన్నారు. ఎన్ఐఏ తరపు ప్రత్యేక పీపీ.... ఆ ఎఫ్ఐఆర్లు షెడ్యూల్డ్ నేరాల కిందకు రావన్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.... హైకోర్టు కంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎక్కువా..? అని ప్రశ్నించింది. రాష్ట్రాల ఆమోదం ఉంటేనే సీబీఐ దర్యాప్తు చేయాలంది. అయినా హైకోర్టు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు చేస్తోందని తెలిపింది.
ఇదీ చదవండి