సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టింగ్‌ల విషయంలో దర్యాప్తు పురోగతిపై సీబీఐ ప్రాథమిక నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేయడానికి మూడు నెలల సమయం పడుతుందని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు కోర్టుకు తెలిపారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను జూన్ 28కి వాయిదా వేసింది. సాధ్యమైనంత త్వరగా విచారణను పూర్తి చేయాలని మౌఖికంగా స్పష్టం చేసింది.
హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా, న్యాయమూర్తులను తీవ్ర పదజాలంతో దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన పలువురిపై సీఐడీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవంటూ అప్పటి హైకోర్టు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ జనరల్(ఆర్‌జీ) వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా.. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సామాజిక మాధ్యమాల సర్వీసు ప్రొవైడర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు. దర్యాప్తు పూర్తికి మరో 3 నెలలు పడుతుందని తెలిపారు.
ఇదీ చదవండి: నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా