పీజీ వైద్య, దంత వైద్య విద్య కొత్త ఫీజుల వ్యవహారం మళ్లీ మొదటకొచ్చింది. కళాశాలల వారీగా ఫీజులను ఖరారు చేస్తూ ఏపీ ఉన్నత విద్య, నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలు పరిశీలించి ఆమోదం తెలిపే సమయంలో పునఃపరిశీలన జరపాలని అధికారులకు ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. కొత్త ఫీజులపై ఉత్తర్వులు రాగానే ప్రవేశాల నోటిఫికేషన్ జారీచేస్తామని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ శ్యాంప్రసాద్ వెల్లడించారు.
నోటిఫికేషన్ జారీలో జాప్యం జరిగినందున తొలివిడత ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ఒకటి, రెండు రోజులు ఆలస్యం కానుంది. ఒకే తరహా ఫీజులను అమలుచేయాలని వైద్య కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 2017-18 విద్యా సంవత్సరంలో ఒకే తరహాలో ఖరారు చేసిన ఫీజులను కమిషన్ తగ్గించింది. కళాశాలల యాజమాన్యాలు సమర్పించిన వార్షిక ఆదాయం, వ్యయాలు అనుసరించి కొత్త ఫీజులను ప్రతిపాదించింది.
- పీజీ మెడికల్ క్లినికల్ డిగ్రీ అండ్ క్లినికల్ డిప్లొమా కన్వీనర్ కోటా ఫీజు గరిష్టం 5,13,000 - కనిష్ఠం 4,32,000 రూపాయలు
- పారా - క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కన్వీనర్ కోటా ఫీజు గరిష్ఠం 1,53,000 - కనిష్ఠం 1,27,600 రూపాయలు
- ప్రీ క్లినికల్ డిగ్రీ కన్వీనర్ కోటా ఫీజు గరిష్ఠం 83,000 - కనిష్టం 51,000 రూపాయలుగా ప్రతిపాదించారు
- బి-కేటగిరి సీటు ఫీజు కన్వీనర్ కోటా సీటు కన్నా రెండింతలు, సి- కేటగిరి సీటు ఫీజు కన్వీనర్ కోటా సీటు కన్నా ఆరింతలు ఎక్కువగా ఉండేలా ప్రతిపాదించారు
- పీజీ డెంటల్కు సంబంధించి క్లినికల్ డిగ్రీ కన్వీనర్ కోటా ఫీజు గరిష్ఠంగా 3,53,000 కనిష్ఠంగా 2,95,000 రూపాయలు
- పారా క్లినికల్ డిగ్రీ కన్వీనర్ కోటా ఫీజు గరిష్ఠంగా 3,39,000 కనిష్ఠంగా 2,65,000 రూపాయలుగా ప్రతిపాదించారు
- బి కేటగిరి సీటు ఫీజు కన్వీనర్ కోటా సీటు కన్నా రెండింతలు, సి- కేటగిరి సీటు ఫీజు కన్వీనర్ కోటా సీటు కన్నా ఆరింతలు ఎక్కువగా ఉంటుందని కమిషన్ ప్రతిపాదించింది.
ఇదీ చదవండి : స్వదేశం వెళ్లేందుకు ఎల్‌జీ ప్రమాద దర్యాప్తు బృందం యత్నం...