రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ సహా కీలకమైన ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికల్ని అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయిలో హైపవర్ కమిటీని ప్రభుత్వం నియమించింది. పది మంది మంత్రులు సహా కీలక శాఖలకు చెందిన ఉన్నతాధికారులను కూడా సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంశంతో పాటు పునర్విభజన చట్టంలోని వివిధ అంశాల్లో సర్కారు అనుసరించాల్సిన వ్యూహాలపై సిఫార్సులు చేసేందుకు దీనిని నియమించారు.
16 మంది సభ్యులు
పది మంది మంత్రులు, అధికారులు సహా 16 మంది సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడు రాజధానుల అంశంపై జీఎన్ రావు కమిటీ సిఫార్సుల మేరకు అధ్యయనం చేసి.. ఈ హైపవర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
కమిటీలో మంత్రులు వీళ్లే
ఆర్థిక మంత్రి బుగ్గనతో పాటు ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి, సమాచారశాఖ మంత్రి పేర్నినాని సభ్యులుగా ఈ హైపవర్ కమిటీలో నియమించారు.
కమిటీలో అధికారులు
మంత్రులతో పాటు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక శాఖ కార్యదర్శి జే.శ్యామలరావు, న్యాయశాఖ కార్యదర్శులు సభ్యులుగా హైపవర్ కమిటీ ఏర్పాటైంది.
బీసీజీపై మూడువారాల్లో నివేదిక
రాజధాని అంశంపై ఏర్పాటైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చే నివేదికను సైతం పరిశీలించి తమ అధ్యయన నివేదికలో పొందుపర్చాలని హైపవర్ కమిటీకి సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నిపుణుల కమిటీ, బీసీజీ సిఫార్సులను అధ్యయనం చేసి మూడువారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే న్యాయపరమైన అంశాలపై హైపవర్ కమిటీ అడ్వకేట్ జనరల్‌ను సంప్రదించాలని సూచించారు. 2020 జనవరి 3 తేదీన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రాజధానిపై సాంకేతిక అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. వీటితో పాటు క్షేత్రస్థాయిలోని అంశాలను కూడా హైపవర్ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి మూడు వారాల్లోగా నివేదికను ఇవ్వనుంది.
ఇదీ చూడండి: