కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులను తరలించేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారినిఇక్కడికి రప్పించేలా చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేక రైళ్లలో వలస కూలీలను ఇబ్బందులు లేకుండా వారి వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో...
నెల్లూరు జిల్లా నుంచి బిహార్‌కు చెందిన వలస కార్మికులు సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. జిల్లా నుంచి దాదాపు 1,200 మంది కార్మికులను తరలిస్తుండగా ఒక్క నెల్లూరు నగరం నుంచే 400 మందికి పైగా కార్మికులున్నారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేక రైళ్లలో వీరిని స్వస్థలాలకు పంపించారు. లాక్‌డౌన్‌తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాము.. ఇప్పుడు సొంతూళ్లకు వెళ్తుండడంపై వలస కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.
గూడూరులో తరలింపునకు బ్రేక్...
నెల్లూరు జిల్లా గూడూరులో లాక్డౌన్ కారణంగా చిక్కుకున్న వలస కార్మికులను వారి స్వస్ధలాలకు తరలించేలా ప్రత్యేక రైలును అధికారులు ఏర్పాటు చేశారు. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశాకు చెందిన దాదాపు 330 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వీరిలో కొందరికి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల మళ్లీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈక్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరి తరలింపునకు బ్రేక్ పడింది. త్వరలోనే వీరిని సొంతూళ్లకు పంపిస్తామని తహసీల్దార్ లీలా రాణి తెలిపారు.
అనంతపురం జిల్లాలో...
ఉపాధి కోసం ముంబయి వెళ్లి లాక్‌డౌన్‌తో అక్కడ చిక్కుకున్న దాదాపు 600 మంది అనంతపురానికి చెందిన వలస కూలీలు స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరిలో విడపనకల్లు మండలం కొత్తకోట, హవలిగి, కరకముక్కల, పాల్తూరు గ్రామాలకు చెందినవారున్నారు. ప్రత్యేక రైల్లో గుంతకల్లు చేరుకున్న వీరిని అధికారులు ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులను గమనించి స్వస్థలాలకు చేర్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.
తిరుపతిలో ఆందోళన
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తమను స్వస్థలాలకు చేర్చాలని కార్మికులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులు ఆయా రాష్ట్రాలకు పంపించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై కార్మికులు అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి..