వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి జిల్లా స్థాయిలో 4 రకాల సామగ్రి సరఫరాకే గృహ నిర్మాణశాఖ పరిమితం కానుంది. కంకర (20 ఎంఎం, 40 ఎంఎం), ఇటుకలు, ఫాల్-జీ బ్లాక్‌లనే సరఫరా చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి జిల్లా స్థాయిలో 8 రకాల సామగ్రి సరఫరా చేసేలా గృహ నిర్మాణశాఖ మొదట్లో ప్రణాళికను రూపొందించినా గుత్తేదారుల నుంచి స్పందన కరవైంది. ప్రభుత్వ, మార్కెట్ ధరలకు మధ్యన పొంతన లేకపోవడంతో గుత్తేదారు సంస్థలు బిడ్ దాఖలుకు ముందుకు రాలేదు. రెండు, మూడుసార్లు టెండర్లు పిలిచినా పెద్దగా ఆసక్తి కనబరచలేదు.
టెండర్లు పిలిచినా ముందుకురాని గుత్తేదారులు..
దీంతో అందుబాటులో ఉన్న సామగ్రినే సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గృహ నిర్మాణానికి 22 రకాల సామగ్రి అవసరమని గుర్తించిన అధికారులు వాటిని 2 రకాలుగా విభజించి రాష్ట్ర, జిల్లా స్థాయిలో టెండర్ల ప్రక్రియ చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో రెండు వస్తువులు మినహా 11 వస్తువులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా స్థాయిలో కంకర, ఫాల్-జీ బ్లాక్‌లు, కంట్రీ బ్రిక్స్, ఆర్‌సీసీ వెల్ రింగ్స్, కడప స్లాబ్‌లు, ఆర్‌ఆర్ స్టోన్స్, సీసీ బ్లాక్‌లు, ఎస్సీ బ్లాక్‌లు ఇలా మొత్తం 8 రకాల సామగ్రిని లబ్ధిదారులకు సరఫరా చేయాలని గృహ నిర్మాణశాఖ మొదట నిర్ణయించింది. ప్రభుత్వ నిర్దేశిత 1.80 లక్షల రాయితీ ప్రకారం వీటి ధరలను నిర్ధారించి జిల్లాలకు పంపారు. ఆ మేరకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి టెండర్ల ప్రక్రియను మార్చినా ఫలితం లేదు.
రిజిస్ట్రేషన్, జీఎస్టీ, ఆదాయపన్ను చెల్లింపు సమస్యలతోనే..
ప్రభుత్వ నిర్దేశిత ధరలకు, మార్కెట్ ధరలకు పొంతన లేకపోవడంతో గుత్తేదారు సంస్థలు బిడ్ దాఖలుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత నాడు-నేడు పథకానికి నిర్దేశించిన ధరలతో టెండర్లు పిలిచినా ఫలితంలో మార్పు లేదు. ఆపై మార్కెట్‌కు అనువైన ధరలతో టెండర్లకు వెళ్లినా కంకర, రెండు రకాల ఇటుకలు మినహా మిగతా వాటికి స్పందన లేదు. రిజిస్ట్రేషన్, జీఎస్టీ, ఆదాయపన్ను చెల్లింపు సమస్యలతో గుత్తేదారు సంస్థలు ముందుకు రాని పరిస్థితి ఉంది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన ఇటుక, కంకర ధరలు జిల్లాల వారీగా వేర్వేరుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఖరారైన ధరల్ని ప్రత్యేక యాప్‌లో పొందుపరిచామని పేర్కొంటున్నారు.
ఇదీ చూడండి: old school buildings: ఏ నిమిషానికి...ఏదీ కూలునో!