ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో అనుమానిత కేసులు నమోదు కాగా.. నెల్లూరు జిల్లాలో పాజిటివ్ కేసు నమోదైంది. ఆ వ్యక్తిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అంటు వ్యాధుల చట్టం 1897 కింద.. జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్వోలు..సంబంధిత ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకునేలా అధికారాలు కల్పించారు. సమస్య తీవ్రత బట్టి ఆయా వ్యక్తులను నిర్బంధించడం, అవసరమైతే రాకపోకలపై నిషేధం విధించేలా ఈ చట్టం కింద పూర్తి అధికారాలు ఉంటాయి.
కరోనా కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి ద్వారా వైరస్‌కు సంబంధంచిన సమాచారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, టీవీల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో వైరస్ నిరోధానికి సంబంధించిన కరపత్రాలు అందుబాటులో ఉంచారు.
వ్యాధి నిర్దరణలో ప్రధానమైన క్వారంటైన్ కేంద్రాలను విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు రాష్ట్రంలో ఎవరైనా కరోనా అనుమానితులను ఈ కేంద్రాల్లో పరిశీలనలో ఉంచుతారు. 14 రోజుల తర్వాత వారిలో వైరస్‌కు సంబంధించి లక్షణాలు లేవని నిర్ధరించుకున్న తర్వాత డిశ్చార్జి చేస్తారు. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే... వెంటనే వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తారు.
కరోనా పరీక్ష కేంద్రాలను ఇప్పటికి వరకు తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రి, విజయవాడలోని సిద్దార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేశారు. విజయవాడలో ఇంకా పరీక్ష దశలోనే ఉంది. ప్రస్తుతం ఇక్కడ సేకరించిన నమూనాలు పుణె పంపుతున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనాకు సంబంధించి చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖ వివిధ ప్రైవేటు ఆస్పత్రులకు లేఖలు రాసింది. ఆరోగ్యశ్రీ అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో ప్రస్తుతం కరోనా చికిత్స అందిస్తున్నారు. 50 పడకలు ఉన్న ఆస్పత్రిలో ఒక గదితో పాటు... 2 పడకలు కేటాయించాలి. 100 పడకలు ఉన్న ఆస్పత్రుల్లో 3 గదులు....5 పడకలు ఏర్పాటు చేయాలి. 100కుపైబడి పడకలు ఉన్న ఆస్పత్రులు కచ్చితంగా... 5 గదులు, 10 పడకలు కేటాయించేలా లేఖల్లో పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించే ముందు వైద్యులు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచించింది. కరోనా అనుమానితుల నుంచి రక్తంతోపాటు గొంతులో నుంచి తీసే ద్రవాన్ని ప్రయోగాశాలలకు పంపించి విశ్లేషించేందుకు అంతర్జాతీయంగా పేరున్న ఓ కొరియర్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. కరోనా కిట్లు కేవలం కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మాత్రమే పంపుతుంది.