రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానం కోసం దాదాపు 9 వేల కోట్ల మేర నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం పాలనానుమతులు జారీ చేసింది. కడపలోని జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ పంపిన ప్రతిపాదనలను ఆమోదించిన ప్రభుత్వం... గండికోట- చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గండికోట- పైడిపాలెం ఎత్తిపోతల పథకాల విస్తరణతో పాటు అనుసంధానానికి 3,556 కోట్ల రూపాయల పనులకు పాలనానుమతులు జారీ చేసింది.
మరోవైపు గాలేరు నగరి నుంచి హంద్రినీవా అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి, అధ్యయనానికి 5,139 కోట్ల రూపాయల మేర పాలనానుమతులు మంజూరు చేసింది. గండికోట టన్నెల్ ద్వారా అదనంగా మరో 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు వీలుగా కాలువ సామర్ధ్యం పెంచేందుకు 604 కోట్ల రూపాయల మేర పాలనానుమతిని ఇచ్చింది. గాలేరు నగరి కాలువకు అదనంగా మరో పదివేల క్యూసెక్కుల నీటిని తరలించేలా గండికోట అదనపు టన్నెల్ నిర్మాణం, అధ్యయనంతో పాటు పాత నిర్మాణాల తొలగింపు లాంటి పనులకు ఈ నిధులు వెచ్చించేందుకు అనుమతులు ఇచ్చింది.
ఎత్తిపోతల ప్రాజెక్టు అభివృద్ధి పనులకుగానూ సమగ్ర అంచనాలను రూపొందించుకోవాలని కడపలోని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చినందున్న ప్రాజెక్టులో వినియోగించే ఇసుక ధరల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని జలవనరులశాఖ స్పష్టం చేసింది. ప్రాజెక్టు డిజైన్లకు కూడా అనుమతులు తీసుకోవాల్సిందిగా కడపలోని జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్‌కు సూచనలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి