గ్రామీణులకు అత్యంత చౌకగా కేబుల్, ల్యాండ్‌లైన్, ఇంటర్నెట్ సేవలు అందించాలన్న లక్ష్యం ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. రెండో దశ భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్(బీబీబీఎన్‌ఎల్) పనులు నిలిచిపోయాయి. కేంద్ర నిధులు సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదలలో జాప్యంతో రెండోదశ పనులు ముందుకు సాగడం లేదు.
పట్టణ, మండల కేంద్రాలకే పరిమితం
బీబీబీఎన్‌ఎల్ మొదటి దశలో అన్ని మండల కేంద్రాల వరకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు రెండో దశలో ఓఎఫ్‌సీ విస్తరించాల్సి ఉంది. ఇది పూర్తయితేనే పూర్తి స్థాయిలో సేవలు అందనున్నాయి. ప్రస్తుతం పట్టణ, మండల కేంద్రాల్లోని 9.5 లక్షల కనెక్షన్లకే సేవలు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం. కనీసం 50 లక్షల కనెక్షన్లు ఇస్తే సంస్థకు నష్టాల భారం తప్పుతుంది. దీనికోసం రెండో దశ పనులు వేగంగా పూర్తి చేయాలని సంస్థ భావిస్తోంది.
రాష్ట్ర వాటా ఇవ్వడమే తరువాయి
బీబీబీఎన్‌ఎల్ రెండో దశ పనుల కోసం మొత్తం రూ.1,400 కోట్ల నిధులు అవసరం. ఇందులో కేంద్రం వాటా రూ.900 కోట్లు. మిగిలిన రూ.500 కోట్లు రాష్ట్రం భరించాలి. రాష్ట్రం నిధులు విడుదల చేస్తే కేంద్రం తన వాటా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
ఖర్చుల భారం తగ్గేది ఎలా..?
బీబీబీఎన్‌ఎల్ ఒక్కొక్క కనెక్షన్‌కు రూ.235 వంతున సంస్థ వసూలు చేస్తోంది. ఇందులో కేబుల్ ఆపరేటర్ కమిషన్, సెట్‌టాప్ బాక్స్ ఖర్చు మొత్తం వసూలు, సేవా పన్ను మినహాయిస్తే గరిష్ఠంగా రూ.35 మాత్రమే సంస్థకు మిగులుతోంది. సంస్థ వెచ్చించే ఖర్చులు మాత్రం భారీగా ఉంటున్నాయి. వాటిని ఎలా తగ్గించుకోవాలనే దానిపై ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నారు.
త్వరలోనే చేపడతాం
గ్రామ సచివాలయాలకు ఇంటర్నెట్ సేవలను ఏపీ ఫైబర్ నెట్ ద్వారా వినియోగించుకోవాలన్న ఆలోచన ఉందని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలకూ సేవలు అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో రెండో దశ పనులను త్వరలోనే చేపడతామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: