ap electricity employees: ‘‘మేము ఆప్షన్ ఇవ్వకున్నా ఆంధ్రప్రదేశ్‌లో రిలీవ్ చేశారు.. తెలంగాణలో చేర్చుకోవడం లేదు. వేతనాలు లేక అల్లాడుతున్నాం. అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలో చూపించుకోలేని పరిస్థితి. అప్పులు సైతం దొరకట్లేదు. రెండు ప్రభుత్వాలు మా విషయంలో మానవత్వంతో వ్యవహరించాలి’’ అని పలువురు విద్యుత్తు ఉద్యోగులు కోరారు.
ఆంధ్రప్రదేశానికి వద్దామంటే ఇక్కడా తీసుకోవడం లేదని వాపోయారు. కొందరికి 19 నెలలుగా, మరికొందరికి 13 నెలలుగా జీతాలు లేవని పలువురు మహిళా ఉద్యోగులు కంటతడి పెట్టారు. అందరినీ కలిసి అలసిపోయి చివరికి టీఎస్ యాస్పిరెంట్స్ ఫోరంగా ఏర్పడి మీడియా ముందుకు వచ్చామన్నారు. శుక్రవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫోరం కన్వీనర్ టీవీరావు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్ ఉద్యోగుల విభజన జరగాల్సి ఉందన్నారు. అప్పటి ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడి 2015 వరకూ విభజన చేయలేదన్నారు.
ఏపీ సరిగా స్పందించకపోగా, తెలంగాణకు ఆప్షన్ ఇవ్వని 84 మంది ఉద్యోగులను బలవంతంగా ఇక్కడికి పంపారని తెలిపారు. విద్యుత్తు సంస్థల్లో ఏపీకి చెందిన ఉద్యోగులే అధికంగా ఉండటంతో సమస్య జటిలమైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. లేని పక్షంలో రెండు రాష్ట్రాల యాజమాన్యాలు చెరి సగం చొప్పునైనా ఇవ్వాలని కోరారు. సమావేశంలో విద్యుత్తు సంస్థల్లో వివిధ అధికార హోదాల్లో పనిచేసిన పద్మజ, పరిమళ, శేషగిరిరావు, వెంకటరమణ, శ్రీలక్ష్మి, సైదులు, ప్రతాప్ పాల్గొన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!