‘కరోనా మూడో వేవ్ వస్తుందని నిర్ధారణ కాకున్నా అందుకు సిద్ధమవుదాం. అవసరమైన ఏర్పాట్లు చేసుకుందాం. అప్పటికప్పుడు మందులు కావాలంటే దొరకవు. ముందే తెచ్చిపెట్టుకుందాం. ఆశా కార్యకర్తలకు, ఆరోగ్య కార్యకర్తలకు వీటి లక్షణాలపై శిక్షణ ఇద్దాం. ఆసుపత్రులను, పీడియాట్రిక్ వార్డులను సిద్ధం చేసుకుందాం’ అని అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘పిల్లల కోసం 3 ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేద్దాం. విశాఖలో ఒకటి, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో మరొకటి, తిరుపతిలో మూడోది. ఒక్కో దానికి రూ.180 కోట్లతో ప్రణాళిక రూపొందించాలి’ అని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మూడో వేవ్ సన్నద్ధతపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఇది కచ్చితంగా వస్తుందని చెప్పలేమని, అందుకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని, అది వస్తుందా... రాదా అన్న విషయంపై స్పష్టత లేదని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కొవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ జవహర్‌రెడ్డి, ఇతర అధికారులు అనిల్ కుమార్ సింఘాల్, ఎం.టీ కృష్ణబాబు, ఎం.రవిచంద్ర, కాటమనేని భాస్కర్, ఎ.బాబు, ఎ.మల్లికార్జున్, వి.విజయరామరాజు, వి.వినోద్ కుమార్, వి.రాములు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...
- కరోనా మూడో వేవ్ వస్తే పిల్లల్లో ఆ ప్రభావం ఎలా ఉంటుంది? తీవ్రత ఏ రకంగా ఉంటుందనే విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.
- అన్ని బోధన ఆసుపత్రుల్లో పీడియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేయాలి. పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి.
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులను పరిశీలించి అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించాలి. మూడో వేవ్ వస్తుందని అనుకుని అందుకు తగ్గట్టుగా మందులు ముందే తెచ్చిపెట్టుకోవాలి. అవసరమైన వైద్యులను గుర్తించాలి. ఆ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
- పిల్లల కోసం ఏర్పాటు చేసే మూడు ఆసుపత్రులు అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్ సెంటర్లుగా ఉండాలి.
కర్ఫ్యూ వేళలు ఇలా..
* కొవిడ్ కేసులు తగ్గుతున్నా... పాజిటివిటీ రేటు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు.
* కర్ఫ్యూను ఈ నెల 20వరకు పొడిగించాలని నిర్ణయించారు.
* 10వ తేదీ తర్వాత కర్ఫ్యూ సడలింపు సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచారు.
* ప్రభుత్వ ఉద్యోగులు కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి