రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఆగస్టు నుంచి పర్యటించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. అందుకు సన్నద్ధంగా ఉండాలని అదికారులకు నిర్దేశించారు. ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్న వైఎస్ జగన్.. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫథకాలు క్షేత్ర స్థాయిలో అమలు తీరును స్వయంగా పరిశీలించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థపై అధికారులతో సమీక్షించిన ఆయన.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులతో చర్చించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు సీఎస్ నీలంసాహ్నీ సహా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 17,097 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వైద్యశాఖ, గ్రామవార్డు సచివాలయాల పోస్టులకు ఒకేసారి షెడ్యూల్ ఇవ్వాలని స్పష్టం చేశారు. జులైలో ఉద్యోగాల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని.. అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.
అధికారులదే బాధ్యత
రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో సంక్షేమ పథకాల క్యాలెండర్ అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. లబ్ధిదారుల జాబితా, ముఖ్యమైన నంబర్లను సచివాలయాల్లో ప్రదర్శించాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందాలని జగన్ స్పష్టం చేశారు. మనకు ఓటేయకపోయినా.. అవినీతి, వివక్ష లేకుండా అర్హులందరికీ పథకాలు అందాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందకపోతే అధికారులనే బాధ్యులను చేస్తానని సీఎం స్పష్టం చేశారు.
ఇదీ చూడండి..