రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 7న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు వివిధ శాఖల ఉన్నతాధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సమాచారమిచ్చారు. 7న ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడంతో మధ్యాహ్నానికి మారిందని తెలిసింది. నరసరావుపేటలో ఈ నెల 6న వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో సీఎం పాల్గొనాల్సి ఉంది. అయితే ఆయన రెండురోజుల పర్యటన నిమిత్తం మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. దీంతో వాలంటీర్లతో కార్యక్రమాన్ని 6న కాకుండా 7న ఉదయం ఏర్పాటు చేశారు. అందువల్ల మంత్రిమండలి సమావేశాన్ని ఆరోజు ఉదయం కాకుండా మధ్యాహ్నానికి మార్చారని తెలిసింది.
మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరెవరిని తప్పిస్తున్నారో ముఖ్యమంత్రి జగన్ 7న కేబినెట్ సమావేశంలో వెల్లడించనున్నారని తెలిసింది. దీంతో ఆయా మంత్రులు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వారి రాజీనామా విషయాన్ని ముఖ్యమంత్రి 8న గవర్నర్‌ను కలిసి వివరించి, వారి స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు అనుమతించాలని కోరతారని సమాచారం. గవర్నర్ ఆమోదం తెలపగానే అదేరోజు కొత్తగా మంత్రిమండలిలోకి వచ్చే వారికి సమాచారమిస్తారని అంటున్నారు. 11న ఉదయం 11:31 గంటలకు వెలగపూడిలోని సచివాలయ భవన సముదాయం పక్కనున్న స్థలంలో ఏర్పాటు చేయనున్న వేదికపై కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.
ఇదీ చదవండి: వికేంద్రీకరణే మా విధానం.. కొత్త జిల్లాలతో ప్రజలకు మెరుగైన పాలన: సీఎం జగన్